సాగునీటి సంఘాల ఎన్నికలకు కసరత్తు

ప్రజాశక్తి – కడప ప్రతినిధి కడప జిల్లాలో 206, అన్నమయ్య జిల్లాలో 94 సాగునీటి సంఘాలు ఉన్నాయి. కడప జిల్లా సాగునీటి పారుదల శాఖ పరిధిలో ఆరు ఇరిగేషన్‌ సర్కిల్స్‌ పరిధిలోని మైనర్‌ 112, మీడియం 16, మేజర్‌ 78 వెరసి 206 సాగునీటి సంఘాలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల కింద 94 సాగునీటి సంఘాలు ఉండడం గమనార్హం. 2015లో అప్పటి టిడిపి సర్కారు సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం తెలిసిందే. సుమారు పదేళ్లుగా సాగునీటి సంఘాలు మనుగడలో లేకపోవడంతో రైతుల్లో ఉత్సాహం కొరవడి నట్లు కనిపిస్తోంది. నోటిఫికేషన్‌ అధికారుల దృష్టిఈ నెల 16న సాగునీటి సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా మండలాల వారీగా చెరువుల వివరాల సేకరణలో నిమగమయ్యారు. చెరువుల జాబితా రూపకల్పన చేసిన అనంతరం ఇరిగేషన్‌ అసిస్టెంట్‌ ఇంజినీరింగ్‌ స్థాయి అధికారులను నియామకాలను పూర్తి చేశారు. వీరికి అనుబంధంగా ఆయా మండలాలకు చెందిన తహశీల్దార్‌ స్థాయి అధికారుల నియామకం చేపట్టాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి అనుబం ధంగా అదనపు సిబ్బందిని నియమించాల్సి ఉంది. సభ్యత్వం..సంసిగ్ధం..ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల దగ్గర నుంచి ఆయా చెరువుల పరిధిలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టడంపై దృష్టి సారించాల్సి ఉంది. ఆయా చెరువుల పరిధిలోని సాగు విస్తీర్ణాన్ని బట్టి వందలాది మంది రైతులు ఉన్న సంగతి తెలిసిందే. వీరందరూ సభ్యత్వ నమోదు చేయడానికి ముందు ఎకరాకు రూ.200 చొప్పున నీటి పన్ను చెల్లించడం మొదలగు నిబంధనలను పాటించాల్సి ఉంది. రెండేళ్లుగా వర్షాలు లేక పంటలు పండని నేపథ్యంలో ఎంతమంది రైతులు సభ్యత్వ నమోదుకు ముందుకొస్తారనే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. సభ్యత్వ నమోదుకు ముందుకు వచ్చిన వారితోనే ఎన్నికల తంతు నిర్వహించాలనే ఉద్దేశంతో ఇరిగేషన్‌, రెవెన్యూ అధికార యంత్రాంగాలు సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించడం, ఎన్నికలు నిర్వహించడం, ఫలితాలు ప్రకటన చేయడంపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.పారదర్శక ఎన్నికలు సాగేనా!2015లో నిర్వహించిన సాగునీటి సంఘాల ఎన్నికల ఫలితాల ప్రకటనలో పారదర్శకత కొరవడిన సంగతి తెలిసిందే. అప్పటి సాగునీటి సంఘాల ఎన్నికలను అధికార పార్టీ మెజార్టీ సంఘాలను ఏకగ్రీవం చేసుకుందనే ఆరోపణల ఉన్నాయి. ఒంటిమిట్ట సాగునీటి సంఘ ఎన్నికపై ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయించిన ఘటనలు ఉన్నాయి. తాజా సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణలో గత అప్రజాస్వామిక పోకడలు పునరావృతం గాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించాంజిల్లాలో సాగునీటి సంఘాలకు ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించాం. చెరువుల వారీగా జాబితా సేకరణ దగ్గర నుంచి ఇరిగేషన్‌ అధికారులను నియమించడమైంది. కలెక్టర్‌ ఆదేశాల అనంతరం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తాం.- కె.శ్రీనివాసులు, ఎస్‌ఇ, ఇరిగేషన్‌, కడప.

➡️