ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లాలోని ప్రయివేటు ట్రావెల్స్ సంక్రాంతి పేరిట రెట్టింపు ఛార్జీలతో ప్రయాణికులను దోచుకుంటున్నాయి. సాధారణంగా ప్రయివేటు ట్రావెల్స్ సాధారణ రోజుల్లో సదుపాయాల కల్పన పేరుతో ఆర్టీసీ కంటే అధిక ఛార్జీలను వసూలు చేస్తుండడం తెలిసిందే. ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా 15 శాతం అధికంగా వసూలు చేయడం సహజం. ఛార్జీలను పెంచడంపై పెద్దఎత్తున విమర్శల వర్షం కురవడం తెలిసిందే. ఈ ఏడాది విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నరు వంటి మెట్రోపాలిటన్ నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి రెట్టింపు ఛార్జీలను వసూలు చేస్తుండటాన్ని ప్రభుత్వం చోద్యంగా చూస్తుండడం విమర్శలకు ఆస్కారాన్ని కలిగిస్తోంది. జిల్లా నుంచి హైదరాబాద్, చెన్నరు, బెంగళూరు, విజయవాడ ప్రాంతాలకు 100 ప్రయివేటు ట్రావెల్స్ రాకపోకలు సాగిస్తున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించి ఆర్టీసీ సుమారు 200 బస్సు సర్వీసులను నిర్వహిస్తోంది. పొరుగు జిల్లాల నుంచి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు సుమారు వెయ్యి బస్సు సర్వీసులు నిర్వహిస్తోంది. రెండ్రోజుల కిందట జిల్లా (ట్రాన్స్ పోర్ట్) రవాణాశాఖ అధికారులు ప్రయివేట్ ట్రావెల్స్ అధికారులతో సమా వేశాలు నిర్వహించి, అధికచార్జీలు వసూలు చేయరాదని హెచ్చరిం చారు. అయినప్పటికీ ప్రయివేటు ట్రావెల్స్ యజమానులు సమావేశంలోని నిర్ణయాల అమలును పట్టించుకోవడం లేదు సరికదా, సాధారణ ఛార్జీలకు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. రెట్టింపు దోపిడీ హైదరాబాద్ నుంచి కడపకు సాధారణ రోజుల్లో ఛార్జీ రూ.800 ఉండగా రూ.1500, స్లీపర్ ఛార్జీ రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు వరకు వసూలు చేస్తున్నారు. బెంగళూరు నుంచి సాధారణ రోజుల్లో రూ.650 ఉండగా ప్రస్తుతం రూ.వెయ్యి, స్లీపర్‌లో సాధారణ రోజుల్లో రూ.850 ఉండగా రూ.1,500 వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి కడపకు సాధారణ రోజుల్లో రూ.650 ఉండగా, ప్రస్తుతం రూ.వెయ్యి, స్లీపర్ సాధారణ రోజుల్లో రూ.వెయ్యి ఉండగా రూ.1,500 వసూలు చేస్తున్నారు. కడప-చెన్నరు టికెట్లు సైతం సాధారణం రూ.600, స్లీపర్ టికెట్ రూ.1,500 చొప్పున వసూలు చేస్తున్నారు. మొక్కుబడి తనిఖీలు జిల్లాలోని ప్రయివేటు ట్రావెల్స్ యజమానులు రవాణా శాఖ అధికారులు నిర్వహించిన సమావేశ నిర్ణయాలను అమలు చేయడం లేదు. జిల్లా (ట్రాన్స్‌పోర్ట్) రవాణా శాఖా అధికార యంత్రాంగం కడప, ప్రొద్దుటూరులో ప్రయివేటు ట్రావెల్స్‌పై సర్వీసు రెన్యువల్స్, రూట్ సర్వీసులకు అనుమతి వంటి అంశాలపై తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. 10 అక్రమ సర్వీసులకు రూ.5,73,600 లక్షల మేరకు స్వల్పమొత్తంలో జరిమానాలు విధించడం కొసమెరుపు. ప్రభుత్వ నిబంధనల్ని అధిగమించి ఛార్జీలు వసూలు అంశం ఆధారంగా పకడ్బందీగా తనిఖీలు నిర్వహించి, చర్యలు తీసుకుని ఉంటే సామాన్య ప్రయాణికులకు ఎంతో ఊరట లభించి ఉండేదని చెప్పవచ్చు. దీనిపై ట్రాన్స్‌పోర్ట్ అధికారిని సంప్రదించగా 11 నుంచి 18వ తేదీ వరకు తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటామని, అధికారికమైన గుర్తింపు లేని వాహనాలపై జరిమానాలు విధిస్తామని పేర్కొనడం గమనార్హం.