మసకబారుతున్న ప్రభుత్వ వైద్యం

మదనపల్లె డివిజన్‌ పరిధిలోనే సర్వజన బోధనాస్పత్రే పెద్దాస్పత్రి. ఇక్కడికి ప్రతి రోజూ వెయ్యి నుంచి 1300 మంది వరకూ రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ఇలాంటి సర్వజన బోధనాస్పత్రిలో రోజు రోజుకు ప్రభుత్వ వైద్యం మసక బారుతోంది. 30 మంది వైద్యులు ఉన్నా, అధిక సంఖ్యలో వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా పేద రోగులకు నాణ్యమైన వైద్యం అందడం లేదు. రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్న డాక్టర్లు కమీషన్‌ కాసుల కోసం కక్కుర్తి పడి పేద రోగులను స్కానింగ్‌ సెంటర్లకు పంపుతూ దోపిడీకి పాల్పడుతున్నారు. ముఖ్యంగా 108 అంబులెన్స్‌ సౌలభ్యాన్ని విరివిగా వాడుకుంటూ అవసరం లేని కేసులను సైతం రెఫర్లకు పంపుతున్నారు. ఈ తరుణంలో పని ఒత్తిడికి గురవుతున్న 108 అంబులెన్స్‌ డ్రైవర్లు ప్రమాదాలకు గురవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది మదనపల్లె సర్వజన బోధనాసుపత్రి పనితీరు. ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ మదనపల్లె సర్వజన బోధనస్పత్రిలో ప్రస్తుతం 30 మంది వైద్యులు పనిచేస్తున్నారు. అందుకు తగ్గ వైద్య సిబ్బంది, నర్సులు, ఎఫ్‌ఎన్‌ఒ, ఎంఎన్‌ఒలు విధులు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలో కావాల్సిన సౌలభ్యాలు, వైద్య పరికరాలు ఉన్నాయి. డాక్టర్లు పనిమీద ధ్యాస లేకుండా మొక్కుబడి వైద్యం చేస్తూ పేద రోగులతో చెలగాటమాడుతున్నారు. ఏ చిన్న కేసు వచ్చిన ఇక్కడ వసతులు లేవని, అందుకు తగ్గ వైద్యులు లేరని వెంటనే తిరుపతికి వెళ్లాలంటూ సూచిస్తున్నారు. తమ వల్ల కాదని కొందరు మొర పెట్టుకుంటే.. ఇక్కడ ఉంటే రోగి ప్రాణాలకు తమది గ్యారెంటీ కాదని, అందుకు మీరు ఒప్పుకున్నట్లు సంతకాలు చేస్తే ఇక్కడే పెట్టుకుంటామని భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో రోగి బంధువులు కుటుంబ సభ్యులు బతుకు జీవుడా అంటూ ప్రయివేటు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. కొంతమంది వైద్యులు స్కానింగ్‌లు తీసుకొస్తే సరైన వైద్యం చేస్తామంటూ స్కానింగ్‌ సెంటర్లతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని చీకటి వ్యాపారాలకు తెర లేపుతున్నారు. సంబంధిత స్కానింగ్‌ సెంటర్‌ నుంచి ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి పేద రోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత నెలలో స్కానింగ్‌ సెంటర్‌ బ్రోకర్‌ డాక్టర్లకు తీసుకొచ్చిన కమీషన్‌ కవర్లతో పట్టుబడ్డాడు. వైద్య ఉన్నతాధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోక పోవడంతో ప్రభుత్వ వైద్యుల్లో మరింత నిర్లక్ష్యం ఆవహించింది. మదనపల్లె ఆస్పత్రికి వచ్చే కేసులను రెఫర్‌ పెడుతున్న చిట్టా చూస్తే మతిపోతుంది. జనవరి 1వ తేదీ నుంచి 6వ తేదీ లోపు 28 కేసులను తిరుపతికి రెఫర్‌ పట్టారంటే ఇక్కడ వైద్యుల పనితీరు ఏ మేర ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 108 వాహనాలు ఆరు రోజుల వ్యవధిలో 6,642 కిలోమీటర్లు కేవలం మదనపల్లె టూ తిరుపతి ప్రయాణం చేశాయి. మదనపల్లి 108 10 ట్రిప్పులు, నిమ్మనపల్లి 108 ఆరు ట్రిప్పులు, వాల్మీకిపురం 108 ఐదు ట్రిప్పులు, గుర్రంకొండ 108 నాలుగు ట్రిప్పులు, రామసముద్రం 108 మూడు ట్రిప్పులు తిరిగాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు గండిపడటమే కాకుండా 108 అంబులెన్స్‌ సిబ్బందిపై తీవ్ర పనిఒత్తిడి పడడంతో అంబులెన్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. జనవరి 5వ తేదీ ఆదివారం నిమ్మనపల్లి మండలం ముస్తూరు గ్రామానికి చెందిన శివ (40) కడుపునొప్పితో మదనపల్లె సర్వజన బోధనసుపత్రికి వచ్చాడు. తూతూ వైద్యం అందించిన అత్యవసర విభాగ వైద్యుడు తిరుపతికి వెళ్లాలని సూచించారు. తమకు ఆర్థిక స్తోమత లేదని చెప్పడంతో 108కు రిఫర్‌ చేశారు. అర్ధరాత్రి సమయంలో నిమ్మనపల్లి 108లో శివను తిరుపతికి తరలించారు. సాధారణ స్థితిలో నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్‌ ఎక్కిన శివ పరిస్థితి బాగానే ఉన్నా ఎందుకు రెఫర్‌ చేశారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాత్రి దట్టమైన పొగమంచులో బయల్దేరిన 108 అంబులెన్స్‌ చంద్రగిరి సమీపంలో దారి నడకలో రోడ్డుపై వెళ్తున్న భక్తులపై దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందగా, పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ పాపం మదనపల్లె వైద్యులదే అనడంలో సందేహం లేదు. ఇదే కోవలో నెల రోజుల క్రితం కడప జిల్లా నుంచి 108 అంబులెన్స్‌ను సర్వీసింగ్‌ చేయించుకుని తీసుకొస్తుండగా గువ్వలచెరువు వద్ద బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో మొలకలచెరువు చెందిన పైలెట్‌ మహేష్‌ మృతి చెందాడు. ఇలా అక్కడక్కడ 108 అంబులెన్స్‌ ప్రమాదాలకు గురవుతుండగా ఇందుకు ప్రభుత్వ వైద్యుల రెఫర్లే కారణంగా తెలుస్తోంది. దీనిపై కలెక్టర్‌ సమగ్ర విచారణ చేసి ముఖ్యంగా మదనపల్లె సర్వజన బోధనసుపత్రి వైద్యుల పనితీరుపై విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు. ప్రయివేట్‌ ఆసుపత్రులలో నయమవుతున్న జబ్బులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎందుకు నయం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు కేవలం జీతాల కోసమే పనిచేస్తున్నారే తప్ప రోగులకు సేవ చేయాలనే తపన లేదని, పైగా అదనంగా ప్రయివేటు ఆస్పత్రి నిర్వహించుకోవడం, మరికొంత కొన్ని ప్రయివేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్‌ చేసుకోవడంలో నిమగం కావడంతో వారి చూపు అక్కడే ఉంటోంది తప్ప పేద రోగులకు చికిత్స చేయడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ స్పందించి మదనపల్లె సర్వజన బోధనసుపత్రి వైద్యుల పనితీరుపై దష్టి సారించాల్సి ఉంది. పేద రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అదే తరుణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. బాగున్న కేసులను సైతం రెఫర్‌ చేస్తున్నారు 108ల ద్వారా తిరుపతికి తీసుకు వెళ్లే సౌలభ్యం ఉండడంతో డాక్టర్లు బాగుండే కేసులను సైతం రెఫర్లు పెడుతున్నారు. ఒక వాహనం తిరుపతికి వెళ్లి రావాలంటే ఐదు నుంచి పది గంటల సమయం తీసుకుంటుంది. ఈ సమయంలో ఆ మండలంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే 108లు అందుబాటులో ఉండే అవకాశం లేదు. 108లపై అదనపు పని భారం పడుతుండడంతో సిబ్బంది ఒత్తిడికి గురై ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా రెఫర్లు తగ్గించి తమకు ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నాం – సురేష్‌, 108 పైలెట్‌, మదనపల్లె.వైద్యుల పనితీరుపై సమావేశం నిర్వహిస్తాం వైద్యుల పనితీరుపై సమావేశాన్ని నిర్వహించి విధి విధానాలు సూచిస్తాం. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు క షి చేస్తాము. సాధ్యమైనంత వరకు రెఫర్లు తగ్గించి ఇక్కడే వైద్యం అందేలా చేస్తాం. – కోటేశ్వరి, మెడికల్‌ సూపరింటెండెంట్‌, సర్వజన బోధనాస్పత్రి, మదనపల్లె.

➡️