ఇటీవల గుంటూరు మిర్చియార్డులో ధరల పతనంపై రైతులతో మాట్లాడుతున్న నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పెట్టుబడులు పెరిగి ఒకవైపు.. పంటలకు ధరలు దక్కక మరొకవైపు రైతులు అల్లాడిపోతున్నారు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలోని అన్ని రకాల పంటలకు ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని కాపాడాలని, కార్పొరేట్ సేద్యం వ్యతిరేకించాలని కోరుతూ రైతు, కౌలురైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక, రైతుకూలీ సంఘాల పిలుపు మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక చుట్టుగుంట సెంటర్‌లోని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ధర్నా జరగనుంది. అఖిల భారత రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఈ ధర్నాకు హాజరుకానున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పలు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక, రైతు కూలీ సంఘాల నాయకులు కూడా హాజరు కానున్నారు.అన్ని పంటలకు మద్దతు ధరల అమలు చట్టం రూపొందించి పార్లమెంటులో ఆమోదించాలని, కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం చేయాలని, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు రుణ మాఫీ చేయాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని, స్మార్టు మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని, ధరల స్థిరీకరణకు బడ్జెట్‌లో రూ.5 వేల కోట్ల నిధిని కేటాయించాలని, ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ ప్రాంతాలకూ విస్తరింపజేయాలని, 200 రోజుల పనిదినాలను, రూ. 600 కూలి అమలు చేయాలని, మిర్చి రైతులకు క్వింటాళ్ రూ.20 వేల ధరనిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పోలవరం నిర్వాసితులకు వెంటనే పునరావసం కల్పించి ప్రాజెక్టును పూర్తి చేయాలని, కౌలు దారులకు, దేవాలయ భూముల సాగుదారులకు, బంజరు, చుక్కల భూముల సాగు దారులకు గుర్తింపు కార్డులు, రుణాలు, ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని, జీడి మామిడి, సుబాబులు, కొబ్బరి తదితర పంటలకు మద్దతు ధరలు అమలు చేయాలని, 60 ఏళ్లు నిండిన రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.10 వేలు పింఛన్లు ఇవ్వాలని, కాలువలు, డ్రెయిన్లు, ఎత్తిపోతల పథకాల మరమ్మతులను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని, పాడి రైతులకు లీటరుకు రూ.5 బోనస్ ఇవ్వాలని డిమాండ్‌తో ధర్నా చేస్తున్నట్టు అఖిల భారత రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు కంచుమాటి అజరుకుమార్ తెలిపారు. 2014 నుంచి 2022 మధ్య కాలంలో దేశంలో అప్పుల భారంతో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు లక్షలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కనీస మద్ధతు ధరలు కూడా లభించక రైతులు ఏటా ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రధానంగా మిర్చి, కంది, పత్తి, పొగాకు, పసుపు, శనగ, జొన్న, మొక్కజొన్న, టమోటా, ఉల్లి, కొబ్బరి, జీడి మామిడితో సహా మొత్తం అన్ని పంటలను సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక వైపు ప్రకృతి వైపరిత్యాలు, మరో వైపు చీడపీడల ప్రభావం, పంట చేతికి వచ్చే సమయానికి వ్యాపారులంతా కుమ్మక్కై ధరలను తగ్గించేయడం పరిపాటిగా మారింది. గతేడాది ఉన్న మిర్చి ధరలు ఈ ఏడాది సగానికి సగం పడిపోయాయి. మిర్చికి గతేడాది కనీస ధర రూ.18 వేలు, గరిష్ట ధర రూ.27వేల వరకు ఉండగా ఈ ఏడాది కనీస ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.13,500కి పడిపోయింది. అయితే వ్యాపారులు మాత్రం ఎగుమతులు లేవనే సాకుతో ధరలు తగ్గించారే తప్ప వచ్చిన సరుకును వచ్చినట్టు కొనుగోలు చేయడం వెనుక సిండికేట్ మంత్రాంగం పాత్ర ఉందనే ఆరోపణలు లేకపోలేదు. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి రెండు నెలల తరువాత ఎక్కువ ధరకు అమ్ముకోవాలన్న పన్నాగం బాగా పారిందనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ అంశంపై రెండు నెలల క్రితమే దృష్టిసారించి ఉంటే రైతులకు మేలు జరిగేది. పంట చేతికి వచ్చే సరికి అపరాల ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో అపరాల ధరలు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలో ఉత్పత్తులు బాగున్నా ఇతర దేశాల నుంచి దిగుమతులతో శనగ, కంది ధరల పతనానికి దారితీసింది. ఆస్ట్రేలియా నుండి శనగ దిగుమతులు, మయన్మార్ నుండి కందుల దిగుమతి వల్ల ఉమ్మడి జిల్లాలో ఈ పంటలను సాగు చేసిన రైతులకు నష్టాలు మిగులుస్తున్నాయి. గత రెండు నెలల కాలంలో శనగ, కంది, మినుము, పెసర ఉత్పత్తులకు క్వింటాళ్‌కు సగటున రూ.3 వేల వరకు ధర తగ్గింది. ఒక వైపు ధరలులేక మరో వైపు నానాటికి పెరిగిపోతున్న సాగువ్యయం వల్ల రైతులకు నిరాశ మిగులుతోంది. గతేడాది ఇదే రోజుల్లో కందులు క్వింటాళ్ రూ.10 నుంచి రూ.12 వేలు పలకగా ఈ ఏడాది ప్రస్తుతం రూ.6500 నుంచి రూ.7500 మాత్రమే పలుకుతోంది. మినుములు, పెసల ధరల పరిస్థితి కూడా గత ఏడాది, ఈ ఏడాది ఇదే పరిస్థితి కొనసాగుతోంది. శనగ ధరలు క్వింటాళ్ గతేడాది రూ.8 వేల వరకు పలకగా ఈ ఏడాది రూ.5 వేలకు తగ్గాయి. గరిష్టంగా అన్ని రకాల అపరాల ఉత్పత్తులకు క్వింటాళ్‌కు రూ.3వేల వరకు తగ్గాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో కొంత ధరలు తగ్గినా రిటైల్ మార్కెట్‌లో ధరలు తగ్గడం లేదు. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం రైతుల వద్ద కేవలం 15 శాతం ఉత్పత్తులు కూడా కొనుగోలు చేయలేదు. ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్‌లో 12 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా కేవలం 1.30 లక్షల టన్నుల బియ్యంను కొనుగోలు చేశారు. పత్తి సీజన్‌లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సిసిఐ కొనుగోలు చేయక రైతులు అల్లాడిపోయారు. వ్యవసాయం గిట్టుబాటయ్యేలా ఉత్పత్తి ఖర్చులు కలుపుకుని ఒకటిన్నర రెట్లు అధికంగా ఉండేలా మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో ఢిల్లీ సరిహద్దులో గత నాలుగేళ్లుగా రైతు సంఘాల నాయకులు వివిధ రూపాల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో రైతులను క్షేత్రస్థాయిలో సమాయత్తం చేసేందుకు సోమవారం ధర్నా నిర్వహించనున్నారు.
