ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అపరాల సాగు ఈ ఏడాది ఆశించిన స్థాయిలో లేకున్నా ధరలు మాత్రం గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంగా వ్యాపారులు చెబుతున్నారు. దీంతో భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేసిన రైతులకు నిరాశ ఎదురవు తోంది. రాష్ట్రంలో ఉత్పత్తులు బాగున్నా ఇతర దేశాల నుంచి దిగుమతులతో శనగ, కంది ధరల పతనానికి దారితీసింది. ఆస్ట్రేలియా నుండి శనగ దిగుమతులు, మయన్మార్ నుండి కందుల దిగుమతి వల్ల ఉమ్మడి జిల్లాలో ఈ పంటలను సాగు చేసిన రైతులకు నష్టాలు మిగులుస్తున్నాయి. గత రెండు నెలల కాలంలో శనగ, కంది, మినుము, పెసర ఉత్పత్తులకు క్వింటాల్‌కు సగటున రూ.3 వేల వరకు ధర తగ్గింది. కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి వరకు దిగుమతులకు అవకాశం కల్పించడం వల్ల పప్పు ధాన్యాల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందనియ వ్యాపార వర్గాలు తెలిపాయి. ఒకవైపు ధరల్లేక మరోవైపు పెరుగుతున్న సాగువ్యయం వల్ల రైతులకు నిరాశ మిగులుతోంది. ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహాం లేకపోవడం వల్ల 2024-25 వార్షిక సంవత్సరంలో ఖరీఫ్, రబీలో అపరాల సాగు గణనీయంగా తగ్గింది. ఖరీఫ్‌లో ఆగస్టు 31, సెప్టెంబరు 1న సంభవించిన తుపాను వల్ల అతి భారీ వర్షాలతో అపరాల పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయి. ఉత్పత్తి కూడా తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సెప్టెంబరు తరువాత సాగు చేసిన శనగ పంటకి వర్షాలు సానుకూలంగా మారి దిగుబడులు ఆశాజనకంగావున్నాయి. ధరల లేమి రైతులను కలవరపరుస్తోంది. గతేడాది ఇదే రోజుల్లో కందులు క్వింటాళ్ రూ.10-12 వేలు పలకగా ప్రస్తుతం రూ.6500-7500 మాత్రమే పలుకుతోంది. మినుములు, పెసల ధరల పరిస్థితి కూడా ఇంతే ఉంది. శనగ ధరలు క్వింటాళ్ గతేడాది రూ.8 వేల వరకు పలకగా ఇప్పుడు రూ.5 వేలకు తగ్గాయి. గరిష్టంగా అన్ని రకాల అపరాల ఉత్పత్తులకు క్వింటాళ్‌కు రూ.3 వేల వరకు తగ్గాయి. అయితే హోల్‌సేల్ మార్కెట్‌లో కొంత ధరలు తగ్గినా రిటైల్ మార్కెట్‌లో ధరలు తగ్గడం లేదు. ప్రధానంగా మాల్స్‌లో కంది పప్పు, మినప గుళ్లు ధరలు కిలో రూ.130కు విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులపై సంబంధిత శాఖలు జోక్యం చేసుకుని వినియోగదారుడికి వెసులుబాటు కల్పించేందుకు కృషి చేయడం లేదు.
రబీ రైతుల దిగాలు
ప్రస్తుత రబీ సీజన్‌లో రెండో పంటగా అపరాలు సాగు చేసిన రైతులు దిగాలుగా ఉన్నారు. రబీలో గురటూరు జిల్లాలో 1.84 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తారని అంచనా వేయగా ఇప్పటి వరకు 1.48 లక్షల ఎకరాల్లో సాగైంది. పల్నాడు జిల్లాలో 1.40 లక్షల ఎకరాల అంచనాకుగాను లక్షా 10 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగయ్యాయి. రెండు జిల్లాల పరిధిలో కనీస విస్తీర్ణంలోనే దాదాపు 66 వేల ఎకరాల్లో రబీ సాగవ్వలేదని అధికార వర్గాలు తెలిపాయి. కృష్ణా డెల్టా పరిధిలో వరి స్థానంలో రబీ సాగుకు ఎక్కువ మంది రైతులు జొన్న, మొక్కజొన్న, మినుము, పెసరకు మొగ్గుచూపారు. రబీ సీజన్‌లో 2,500 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఖరీఫ్‌లో వరి కోతల తరువాత రబీలో జొన్న సాగు ఈ ఏడాది 49 వేల ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేయగా ఇప్పటి వరకు 26 వేల ఎకరాల్లోనే సాగు చేశారు. మొక్కజొన్న 52 వేల ఎకరాలకు గాను 46 వేల ఎకరాలలో సాగు చేశారు. మినుము, పెసర, శనగ తదితర పంటలు 90 వేల ఎకరాల్లో వేస్తారని అంచనా ఉండగా 76 వేల ఎకరాల్లో సాగు చేశారు. పల్నాడు జిల్లాలో 10 వేల ఎకరాల్లో కంది సాగు చేయాల్సి ఉండగా 5800 ఎకరాలు, 30 వేల ఎకరాల్లో శనగ సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 17 వేల ఎకరాల్లో సాగు చేశారు. పల్నాడు జిల్లాలో 60 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా వేయగా ఇప్పటి వరకు కేవలం 30 వేల ఎకరాల్లోనే సాగైంది. 21 వేల ఎకరాల్లో మొక్కజొన్న వేస్తారని భావించగా ఇప్పటి వరకు 25 వేల ఎకరాల్లో సాగు చేశారు. పొగాకు విస్తీర్ణం 4200 ఎకరాలకు గాను 14 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇతర పంటలు 9 వేల ఎకరాల్లో సాగు చేశారని అధికార వర్గాలు తెలిపాయి.
