రాష్ట్రంలో ఫ్యాన్‌ గాలి : బొత్స

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ : తాజా ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి ఫ్యాన్‌ గాలి వీచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం సాయంత్రం లాసన్స్‌ బే కాలనీలోని బొత్స ఝాన్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌ సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టి పనిచేశారని, 74 శాతం మంది మహిళలు పలు పథకాల్లో లబ్ధి పొందారని, ఈ క్రమంలో మళ్లీ వైసిపికే ప్రజలు తమ ఓట్లు ద్వారా మద్దతునిచ్చారని భావిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో టిడిపి ఎన్నో అబద్ధాలు చెప్పిందని, మోసపూరిత మాటలు పలికిందని, అమలవుతున్న పథకాలను ఆపించిందని ఆరోపించారు. ప్రజా జీవితంలో నిజాయితీ ముఖ్యమన్నారు. విశాఖలో వైసిపి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాము విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. కూటమి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు వైసిపికి ఓట్లు వేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో సామదాన దండోపాయాలను కూటమి ఉపయోగించిందని, చివరకు తాను వైసిపికి రాజీనామా చేస్తున్నట్టు టిడిపి సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారని తెలిపారు. రైతులు, పేదల సంక్షేమం కోసమే సిఎం జగన్‌ పనిచేశారన్నారు. మంచి చేశానని నమ్మితేనే ఓటు వేయండని చెప్పిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ఇవిఎంల మీద కూటమి విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌ అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేశారన్నారు. కేంద్రంలో బిజెపికి వైసిపి గతంలో అంశాల వారీగా మాత్రమే మద్దతునిచ్చిందని తెలిపారు. వైసిపి నాయకురాలు బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం చైతన్యానికి చిహ్నమని తెలిపారు. ఈసారీ మ్యానిఫెస్టోలోని అంశాలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. సమావేశంలో వైసిపి విశాఖ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, ఎస్‌.కోట వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బొత్స

➡️