ప్రజాశక్తి – మార్కాపురం రూరల్: ప్రమాదవశాత్తు కరెంటు తీగ తగిలి రైతు మృతి చెందిన ఘటన మండల పరిధి లోనీ బొందలపాడు గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. అందిన వి వరాల మేరకు.. బొందలపాడు గ్రామానికి చెందిన మారంరెడ్డి వెంకట సుబ్బారెడ్డి (50) తన పొలానికి చుట్టూ సోలార్ తీగ లతో కంచెను ఏర్పాటు చేసుకున్నాడు. అందులో నుంచి పొలం లోపలికి వెళ్లేందుకు బయటికి వచ్చేందుకు తీగలను ప్రతిరోజు కిందకు దించుతారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం కంచెను కిందికి దించుతుండగా అప్పటికే విద్యుత్ తీగకు సంబంధించిన మెయిన్ లైన్ తెగిపడి సోలార్ కంచెకు తగిలి ఉంది. దీంతో ఆ తీగను కిందికి దించుతున్న క్రమంలో ఒక్కసారిగా వెంకట సుబ్బారెడ్డి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి తప్పించే క్రమంలో అతనికి కూడా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అక్కడే ఉన్న మరికొంతమంది రైతులు చాకచక్యంగా వ్యవహరించి టవల్‌తో ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేయగా వెంకట సుబ్బారెడ్డి అప్పటికే మృతి చెందాడు. మరొక వ్యక్తిని ప్రాణాలతో ఎటువంటి గాయాలు కాకుండా రైతులు కాపాడగలిగారు. సమాచారం అందుకున్న మార్కాపురం గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్సై అంకమ్మరావు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుని స్థానికులు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అంకమ్మరావు తెలిపారు.
