ప్రజాశక్తి – గరుగుబిల్లి : పంటల మార్పిడి విధానంతో రైతులకు లాభమని ప్రకృతి వ్యవసాయం డిపిఎం షణ్ముఖరాజు తెలిపారు. మండలంలోని పిట్టలమెట్ట గ్రామంలో రెడ్డి లక్ష్మునాయుడు వ్యవసాయ క్షేత్రంలో రబీలో సాగుచేసిన పంటలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో వరి పంట పూర్తయ్యాక, రబీలో పెసర 80 శాతం, మిగతా విస్తీర్ణంలో అంతర పంటలైన కొమ్ముశనగ, తోటకూర, గొంగూర, ముల్లంగి, బెండ, చిక్కుడు, తదితర విత్తనాలు వేయడం వల్ల పంటల్లో వైవిధ్యం వస్తుందన్నారు. దీనివల్ల కుటుంబ అవసరాలు తీర్చడంతోపాటు మిగతావి విక్రయించడం ద్వారా ఆదాయం లభిస్తుందన్నారు. భూమిని పచ్చగా ఉంచడంతోపాటు నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంటుందని తెలిపారు. ప్రతిఒక్కరూ పంట మార్పిడి విధానం పాటించడం వల్ల పంటల దిగుబడితోపాటు భూ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు. జిల్లాలోని 15 మండలాల్లో ఈ విధమైన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్.లక్ష్మునాయుడు, డి.వెంకట్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.అపరాల సాగులో జాగ్రత్తలు పాటించాలిసీతానగరం : అపరాల పంటల సాగులో జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్.అవినాష్ అన్నారు. మండలంలోని వెన్నెలబుచ్చెంపేట గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత దశలోనే కలుపు మొక్కలు ఎక్కువగా ఉండి, పంట ఎదుగుదలకు ఆటంకం అవుతాయని చెప్పారు. కలుపు నివారణకు 19-19-19 మల్టీకే ఒక కేజీ చొప్పున పిచికారీ చేసుకోవాలన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఇఒ జగదీష్ పాల్గొన్నారు.