ప్రజాశక్తి-మార్కాపురం: రైతులు లబ్ధి చేకూరే విధంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేస్తామని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చెప్పారు. మార్కాపురం మండలంలోని భూపతిపల్లి, నికరంపల్లి గ్రామాలలో ఉపాధి హామీ పథకంపై బుధవారం గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ అత్యంత కరువు ప్రాంతమైన మార్కాపురం నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సిమెంటు రహదారులు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. తర్లుపాడు మండలంలోని బుడ్డపల్లిలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు ఏర్పాటు చేసి ఆదర్శ గ్రామంగా మారుస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో వెలిగొండ ప్రాజెక్టును తప్పక పూర్తి చేసి రైతులు ముఖాల్లో ఆనందం చూస్తామని తెలిపారు. రైతులు తమ పొలాల్లో డగౌట్ పాండ్‌లు నిర్మించుకొని, ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని రైతులకు సూచించారు. అనంతరం పారిశుద్ధ కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో భాగ్యవతి, ఏపీవో జీవరత్నం, టీడీపీ మండల అధ్యక్షుడు జవ్వాజి రామాంజులరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు, మాలపాటి వెంకటరెడ్డి, కె.కొత్తపల్లి గ్రామ సర్పంచి మట్టం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.