ప్రజాశక్తి-భోగాపురం : బైరెడ్డి పాలెం, దల్లిపేట గ్రామాల్లో చేపట్టిన విమానాశ్రయం అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులను బుధవారం రైతులు అడ్డుకున్నారు. పరిహారం ఇవ్వకుండా కోర్టులో జమ చేసి భూములపైకి ఎలా వస్తారంటూ నిర్మాణ సంస్థ సిబ్బందిని ప్రశ్నించారు. ఇది తెలిసి వెళ్లిన రెవెన్యూ అధికారులకు కూడా పరిహారం ఇవ్వకుండా భూమిపైకి వస్తే సహించలేదని తేల్చి చెప్పారు. న్యాయస్థానంలో స్టే ఉన్నప్పటికీ పనులు ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు. జాతీయ రహదారి నుంచి విమానాశ్రయానికి వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డు పనులను విమానాశ్రయ నిర్మాణ సంస్థ అక్కడక్కడా ప్రారంభించింది. దీనిలో భాగంగా కంచెరు, గూడెపువలస రెవెన్యూ పరిధిలోని బైరెడ్డి పాలెం, దల్లిపేట గ్రామాల వద్ద పనులు చేసేందుకు సిబ్బంది బుధవారం వెళ్లారు. అయితే అక్కడ సుమారు 20 మంది రైతులు తమ బ్యాంకు ఖాతాలో పరిహారం వేశాక పనులు ప్రారంభించాలంటూ అడ్డుకున్నారు. వెంటనే నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. తహశీల్దార్ సురేష్, అర్‌ఐ ఇమ్రాన్, విర్‌ఒ దేవి వెళ్లి రైతులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. పరిహారం విశాఖలోని భూ సేకరణ ట్రిబ్యునల్ కోర్టులో ప్రభుత్వం జమ చేసి ఉందని తహశీల్దార్ తెలిపారు. తమకు పరిహారం ఇచ్చాకే భూములపై పనులు చేసుకోవాలని రైతులు సమాధానం ఇచ్చారు. దీంతో ఏం చేయాలో తెలియక రెవిన్యూ అధికారులతో పాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులు వెనుదిరిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సుమారు రెండేళ్లు నుంచి ట్రిబ్యునల్ కోర్టు చుట్టూ తిరుగుతున్నప్పటికీ నేటికీ మాకు నష్టపరిహారం అందలేదని తెలిపారు. పరిహారం వచ్చేవరకు పనులు ప్రారంభించనివ్వ బోమని చెప్పారు.