రైతులు, దళితుల కోసం పోరాడిన ఆమంచి నరసింహారావు

May 15,2024 00:37

ప్రజాశక్తి – క్రోసూరు : ఆమంచి నరసింహారావు గొప్ప స్వాతంత్య్ర సమరయోధులుగానే కాకుండా రైతుల సమస్యలపైనా పోరాడారని, కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికీ విశేషంగా కృషి చేశారని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రవిబాబు అన్నారు. మండల కేంద్రమైన క్రోసూరులోని ఆమంచి విజ్ఞాన కేంద్రంలో ఆమంచి నరసింహారావు 26వ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జి.రవిబాబు పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి టి.హనుమంతరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో రవిబాబు మాట్లాడుతూ 1916లో పుట్టిన నరసింహారావు స్వాతంత్య్రానికి ముందే ఎన్‌జి రంగాతో కలిసి పోరాడారన్నారు. సత్తెనపల్లి తాలూకా ప్రాంతంలో పుల్లరి వ్యతిరేక పోరాటంలో, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ చురుగ్గా పాల్గొన్నారన్నారు. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి, కార్యకర్తల గుర్తించి తీర్చిదిద్దడానికి కీలకంగా పని చేశారని చెప్పారు. ఊటుకూరు నుండి పుతుంబాక వెంకటపతిని గుర్తించి రాజకీయాల్లోకి తేవడానికి కృషి చేశారని అన్నారు. వేల్పూరు సర్పంచ్‌గా గ్రామంలో చెరువు పోరంబోకు భూమిని పట్టా భూమిగా మార్పు చేసి జెడ్‌పి పాఠశాల నిర్మాణానికి పాటుపడ్డారన్నారు. దళితులపై వివక్షతకు వ్యతిరేకంగా నిలబడ్డారని, దళితులకు డొంక రోడ్డు నిర్మించి వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత పాలకులు దేశ సంపదను కొల్లగొట్టి కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని, సామాన్యులపై ధరలు, పన్నుల భారం మోపుతున్నారని చెప్పారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఆమంచి నరసింహారావు స్ఫూర్తితో పోరాడదామని పిలుపునిచ్చారు. సభలో సిపిఎం అచ్చంపేట మండల కార్యదర్శి ఆర్‌.వెంకటేశ్వర్లు, నాయకులు సిహెచ్‌ యేసయ్య, జి.చిన్నప్ప, కె.గోపిరెడ్డి, జి.మహేష్‌, పి.రాజు పాల్గొన్నారు.

➡️