రైతులను ఆదుకోవాలి

ప్రజాశక్తి-పెద్దదోర్నాల : మండల పరిధిలోని ఐనముక్కల గ్రామ పరిసర పొలాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నల్లవాగు, వంకవాగు ద్వారా వరద నీరు ప్రవహించింది. వెలుగొండ ప్రాజెక్టు, వాగుల నీరు పోయేందుకు నిర్మించిన బ్రిడ్జి వద్ద గండి పడింది. దీంతో నీరు వరద నీరంతా వృథాగా పోతుంది. చిన్నగుడిపాడు చెరువుకు నీరు చేరడం లేదు. దీంతో రైతులు ఇక్కట్ల గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకుల బృందం బ్రిడ్జి వద్ద పడిన గండిని మంగళవారం పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పమిడి వెంకట్రావు మాట్లాడుతూ వృథాగా నీరు పోవడం మూలంగా రైతాంగం నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాలువ పడిన గండ్లను పూడ్చడంతో పాటు బ్రిడ్జికి మరమ్మతులు చేయించాలన్నారు. వరద నీరు చిన్నగుడిపాడు చెరువుకు వచ్చి చేరేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జె. జయంతిబాబు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాబు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దుగ్గెంపూడి తిరుపతిరెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి ఒంటేరు రాజకృష్ణ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️