వైద్య పరిశోధనల కోసం తండ్రి భౌతికకాయం!

Oct 2,2024 00:20

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తండ్రి భౌతికకాయాన్ని వైద్య పరీక్షలు, నేత్ర దానానికి అప్పగించాడు ఓ కుమారుడు. రొంపిచర్ల మండలం వీరట్నం గ్రామానికి చెందిన కేతరాజుపల్లి నాగేశ్వరరావు (85) మంగళవారం అనారోగ్యంతో మతి చెందారు. కాగా మృతుని కుమారుడు వేమలయ్య తన తండ్రి మృతదేహాన్ని రొంపిచర్ల భగత్‌సింగ్‌ భవన్‌ నిర్వహణ కమిటీ సభ్యులు సహకారంతో ‘అమ్మ’ నేత్ర అవయవ శరీర దానం ప్రోత్సాహక సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కళాశాలకు, నేత్రాలను పెదకాకాని శంకర కంటి ఆస్పుత్రికి అప్పగించారు. ఈ సందర్భంగా అమ్మ నేత్ర, అవయవ, శరీర దాన ప్రోత్సాహక సంఘం పల్నాడు జిల్లా కో-ఆర్డినేటర్‌ సండ్రపాటి చలపతిరావు మాట్లాడుతూ వ్యక్తి మృతి అనంతరం కళ్లు కొన్ని గంటల వరకు బాగానే ఉంటాయని, వాటిని ఇతరులకు అమర్చే వీలుంటుందని చెప్పారు. శరీరాన్ని వైద్య ప్రయోగాలకు వినియోగించొచ్చన్నారు. కార్యక్రమంలో భగత్‌సింగ్‌ భవన్‌ నిర్వహణ కమిటీ సభ్యులు ఎస్‌.రామకృష్ణంరాజు, శేషంరాజు, కె.శివరామ్‌, వెంకట సుబ్బరాజు, మస్తాన్‌వలి, మృతుని కుటుంబీకులు పాల్గొన్నారు.

➡️