ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కేంద్ర బడ్జెట్‌లో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74శాతం నుంచి వందశాతానికి పెంచుతున్నట్లు ప్రకటించడాన్ని నిరసిస్తూ ఎల్‌ఐసి ఉద్యోగులు మంగళవారం ఎల్‌ఐసి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ నిర్ణయం వల్ల భారతీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన మూలధన సమీకరణపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇన్సూరెన్సు ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. ఈ నిర్ణయాన్ని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం ఖండిస్తోందని తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.తిరుమలరావు, అర్.అప్పల నాయుడు మాట్లాడుతూ 1999లో ఐఆర్‌డిఎ బిల్లు ఆమోదం పొందిన తర్వాత బీమా రంగాన్ని ప్రయివేటీకరించారని, ఈ చట్టం ద్వారా భారతీయ పెట్టుబడిదారులు విదేశీ భాగస్వాములతో కలిసి బీమావ్యాపారం నిర్వహించేందుకు అనుమతి పొందారన్నారు. ఆ సమయంలో ఎఫ్‌డిఐ పరిమితిని 26శాతంగా నిర్ణయించారని, తరువాత దానిని 74శాతానికి పెంచారని తెలిపారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం 100శాతం విదేశీ పెట్టుబడులను అనుమతివ్వడం ఇన్సూరెన్సు రంగాన్ని నాశనం చేసేందుకేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలు భారతదేశాన్ని 1956 నాటి పరిస్థితికి తీసుకెళ్తాయని విమర్శించారు. ప్రజల పొదుపులను ప్రమాదంలోకి నెడుతుందన్నారు. కార్మికులు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకునే విధంగా ఈ బడ్జెట్ ఎటువంటి ప్రయత్నమూ చేయలేదన్నారు. ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎల్‌ఐసి ఉద్యోగులు పాల్గొన్నారు. గరివిడి ఎల్‌ఐసి బ్రాంచి కార్యాలయం వద్ద గరివిడి : బీమా రంగంలో వందశాతం ఎఫ్‌డిఐలకు అనుమతినిస్తూ కేంద్ర బడ్జెట్‌లో ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ స్థానిక ఎల్‌ఐసి బ్రాంచి కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. ఐసిఇయు బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు జి.సిద్ధార్థ, డి.వెంకటేష్ మాట్లాడారు. కేంద్రం వెంటనే ఎఫ్‌డిఐ పెంపును విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
