ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్ : పెండింగ్ ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ఫీజుల విషయంలోని గందరగోళంపై రాష్ట్ర ప్రభత్వం సమగ్రమైన వివరణ ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్.వినోద్ డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజులను విడుదల చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో వినోద్ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర కోర్సులు చదువుతున్న 47,423 మంది విద్యార్థులకు 2023-24 సంవత్సరానికి సంబంధించి ఒక క్వార్టర్ మాత్రమే ఫీజులు విడుదల చేశారన్నారు. మిగతా 3 క్వార్టర్లు విడుదల కాలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా గత ఏడాదికి సంబంధించి రూ.109 కోట్ల 32లక్షల 89వేల 253 రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి 3వ క్వార్టర్ గడుస్తున్నా నేటికీ విడుదల కాలేదన్నారు. గత ఏడాది, ఈఏడాది కలిపి సుమారు రూ.218 కోట్లు పెండింగ్ ఉన్నాయన్నారు. అవి కూడా ప్రభుత్వం ప్రకటించిన అర్హులకు సంబంధించినది మాత్రమేనని తెలిపారు. వివిధరకాల కారణాలతో అర్హత కోల్పోయిన వారు కాకుండా ఈ భారం మొత్తం విద్యార్థులపై పడుతుందన్నారు. త్వరలో డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయని, పరీక్షలకు ముందుగానే ఫీజు బకాయిలు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి ఉందన్నారు. ఫీజుల విషయంలో గందరగోళానికి ప్రభుత్వం తెరదించాలని డిమాండ్ చేశారు. గత వైసిపి ప్రభుత్వం విద్యాదీవెన పథకం పేరుతో మొత్తం ఫీజును 4క్వార్టర్లలో ఇవ్వాలని నిర్ణయించారని, ఫీజులు తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసి వారే కళాశాలకు నేరుగా కట్టేలా అమలు చేశారన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ పథకాన్ని తప్పుపట్టారని, సకాలంలో ఫీజులు విడుదల చేయనప్పుడు ఆ భారం విద్యార్థులపై పడుతుందని, ఆంక్షలు పేరుతో కోతలు విధిస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే పాత పద్ధతిలోనే రీయింబర్స్‌మెంట్ పథకం పేరుతో ఫీజులను కళాశాలల ఖాతాల్లోనే జమచేసి విద్యార్థులకు ఫీజుల భారం లేకుండా చదువులు చెబుతామని హామీ ఇచ్చారన్నారు. 2020-21 నాటి పీజీ కాలేజీల బకాయిలు కూడా నేటికీ కొనసాగుతున్నాయని, జీవో నెంబర్ 77రద్దు చేసి పీజీకి రీయిబర్స్‌మెంట్ కల్పించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు ముగిసిన సందర్భంగా విద్యార్థులకు ఇచ్చిన హామీని అమలు చేసి మంచి ప్రభుత్వం అనిపించు కోవాలని సూచించారు. రీయిరబర్స్‌మెంట్ విద్యార్థుల తల్లుల ఖాతాలో వేస్తారా. కళాశాల యాజమాన్యం ఖాతాలో వేస్తారా అనే విషయం పై స్పష్టత ఇవ్వాలన్నారు. పెండింగ్‌లోఉన్న విద్యా దీవెన, వసతి దీవెన ఫీజులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్యపై పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ ఒంగోలు నగర కార్యదర్శి బండి వీరాస్వామి, నగర కమిటీ సభ్యులు విజరు, దేవ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
