ప్రజాశక్తి-దేవరాపల్లి
మండలంలోని గరిసింగి, వాలాబు, చింతలపూడి, తామరబ్బ, పంచాయతీల పరిధిలోని గిరిజన గ్రామాల్లో విస్తృతంగా జ్వరాలు వ్యాప్తిస్తున్నాయని సిపిఎం మండల కార్యదర్శి బిటి.దొర పేర్కొన్నారు. గర్సింగి పంచాయతీలో జ్వరాలతో బాధపడుతున్న జ్వరపీడితులను మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్సింగి పంచాయతీ తాటిపూడి గ్రామంలో జన్ని గంగం దొర, జన్ని దేముడు, చింతలపాలెంలో జన్ని సామలమ్మ, పుట్టింగి సంతోష్, యాలం బైలు, మజ్జి హారిక, జన్ని దివ్య జ్వరాలతో బాధపడుతున్నారని తెలిపారు. మిగిలిన గిరిజన పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. మలేరియా జ్వరాలు వచ్చిన వారు ప్రభుత్వ హాస్పిటల్లో చూపించిన సరైన వైద్యం చేయటం లేదని గరిసింగి పంచాయతీ తాటిపూడి గ్రామస్తులు ఆవేదన చెందినట్లు ఆయన పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వ వైద్య అధికారులు స్పందించి గ్రామస్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం సేవలు అందించాలని దొర డిమాండ్ చేశారు.