ప్రజాశక్తి-శృంగవరపుకోట : ఎన్నో ఏళ్ళు నుండి గ్రామస్థాయిలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గురువారం ఫీల్డు అసిస్టెంట్ల యూనియన్ (సిఐటియు ఆధ్వర్యాన ఎంపిడిఒ సతీష్‌కు వినతి అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి బుల్లిపల్లి ఈశ్వరరావు మాట్లాడుతూ పీల్ట్ అసిస్టెంట్లకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, అక్రమంగా తొలగించిన వారిని విధుల్లోకి చేర్చుకోవాలని, అర్హత, అనుభవం కలిగిన వారికి ప్రమోషన్ కల్పించాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమ తొలగింపులు ఆపాలని కోరారు. మేండేస్‌కు విధానాన్ని రద్దు చేయాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు యూనియన్ నాయకులు జి.ఈశ్వరరావు పెంటయ్య, దేవుడు బాబు, ఎస్వీశ్వరరావు, డి సోమేశ్వర్, కె.బంగారమ్మ సాంబ తదితరులు పాల్గొన్నారు.
మెరకముడిదాం : పీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వారంతా ఎంపిడిఒ జి. భాస్కరరావుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని, అక్రమంగా తొలగించిన వారిని విధుల్లోకి చేర్చుకోవాలని, కోరారు. మేండేస్‌కు విధానాన్ని రద్దు చేయాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
చీపురుపల్లి: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపిడిఒ సురేష్‌కి గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 19 ఏళ్ల నుండి తాము ఎన్నో ఒడిదుడులకు ఎదురొడ్డి ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నామని కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కోరారు మ్యాన్‌డేస్ విధానాన్ని రద్దు చేసి ఫీల్డ్ అసిస్టెంట్లుకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తవుడు, అప్పలనాయుడుతో పాటు పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.