పోర్టు ఆసుపత్రి ప్రయివేటీకరణ ఆపే వరకు పోరాటం

గోల్డెన్‌ జూబ్లీ హాస్పిటల్‌

ప్రజాశక్తి- సీతమ్మధార : పోర్ట్‌ హాస్పిటల్‌ ప్రైవేటీకరణ ఆపే వరకు తమ పోరాటం కొనసాగుతుందని యునైటెడ్‌ పోర్ట్‌ అండ్‌ డాక్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌, సిఐటియు ప్రధాన కార్యదర్శి కె.సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం పోర్టు ఆసుపత్రి వద్ద యూనియన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎనిమిదో రోజు రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, కార్మికుల కష్టంతో విశాఖ పోర్టుకు రూ.వేల కోట్లలో లాభాలు వస్తున్నాయన్నారు. ఈ ఏడాది పోర్టుకు రూ.786 కోట్లు లాభంరాగా అందులో రూ.171.42 కోట్లు ప్రభుత్వానికి పన్నులు రూపేణా కట్టామన్నారు. ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పోర్టుకు వచ్చిన లాభాలతో ఆసుపత్రిని నిర్మించారని, ఇపుడు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గోల్డెన్‌ జూబ్లీ హాస్పిటల్‌గా రూపుదిద్దుకున్న క్రమంలో ఈ ఆసుపత్రిని పిపిపి విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రయివేటుకు కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూడడం దుర్మార్గమన్నారు. ఆసుపత్రి నిర్వహణకు రాబోయే వందేళ్లకు సరిపడేంతగా రిజర్వ్‌ ఫండ్స్‌ పోర్ట్‌ వద్ద ఉన్న నేపథ్యంలో దీన్ని ప్రయివేటుకు కట్టబెట్టి పోర్టు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబాలకు నాణ్యమైన వైద్యాన్ని దూరం చేయాలన్న కేంద్రం ఆలోచన దుర్మార్గమన్నారు. గోల్డెన్‌ జూబ్లీ ఆసుపత్రిని పోర్టు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉంటే,కార్మికులకు అప్పగిస్తే, తామే అభివృద్ధి చేసి నిర్వహించుకుంటామని, దీనికి ఇప్పటికే జిల్లాలోని కార్మిక, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతునిస్తూ సన్నద్ధంగా ఉన్నాయన్నారు. పోర్టు ఆసుపత్రిని ప్రయివేటుపరం కాకుండా ఉద్యమాన్ని ప్రజాపోరాటంగా ఉధృతం చేసి, తామే రక్షించుకుంటామన్నారు. దీక్షలో యూనియన్‌ నేతలు నాయుడు శంకరరావు, గణేష్‌ ,నర్సింగరావు, మహిళలు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️