ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం పోరాటాలు

Jun 10,2024 23:43

అధికారులతో కలిసి మస్టర్‌ను పరిశీలిస్తున్న నాయకులు
ప్రజాశక్తి – క్రోసూరు :
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న బిజెపి నేతృత్వంలోనే ఎన్‌డిఎ ప్రభుత్వం కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిందని, ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని కాపాడుకోవడానికి కూలీలంతా ఐక్య పోరాటాలకు సన్నద్ధమవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రవిబాబు పిలుపునిచ్చారు. మండలంలోని నాగవరం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ప్రదేశాలను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సోమవారం సందర్శించారు. కూలీలతో మాట్లాడి వారి సాదకబాధలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ వ్యవసాయ పనుల్లేని రోజుల్లో కూలీలకు ఆదరవుగా ఉన్న ఉపాధి హామీ చట్టానికి మోడీ ప్రభుత్వం నిధుల కోత విధిచిందన్నారు. కూలీలకు కల్పిస్తున్న అనేక సదుపాయాలనూ నిలిపేసిందని చెప్పారు. వేసవికాలం అలవెన్స్‌, మజ్జిగ, తాగునీళ్లు, పనుముట్లకు అలవెన్స్‌ ఇచ్చేవారని, ప్రమాదాలు జరిగితే తక్షణ వైద్యం కోసం ప్రథమ చికిత్స కిట్‌, నీడ కోసం టెంట్లు తదితర సౌకర్యాలు ఉండేవని తెలిపారు. వాటిని మోడీ ప్రభుత్వం తొలగించడంతోపాటు ఆచరణ వీలుకాని, కూలీలకు ఇబ్బందికరంగా ఉండే కొత్త నిబంధనలు తెచ్చిందని వివరించారు. ప్రస్తుతం వ్యవసాయంలో వచ్చిన మార్పుల వల్ల వంద రోజుల పని దినాలు కూడా చాలని పరిస్థితి వచ్చిందిన, ఈ క్రమంలో ఏడాదిలో ఒక్కోక్క జాబ్‌ కార్డుకు 200 పనిదినాలతోపాటు రోజువారి కూలి రూ.500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం జరిగే పోరాటాల్లో కూలీలు కలిసి రావాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి సయ్యద్‌ హుస్సేన్‌, ఉపాధి హామీ మెట్లు సయ్యద్‌ సైదా, వీరబాబు పాల్గొన్నారు.

➡️