ప్రజాశక్తి- బట్టిప్రోలు : పేదల జీవితాలతో ఆడుకుంటున్న ఫైనాన్స్ కంపెనీల ఆగడాలను అరికట్టాలని, ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న పార్వతిబాయి కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ కోరుతూ తహశీల్దారు కార్యాలయం, పోలీసు స్టేషన్‌లో సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు టి. కష్ణమోహన్ మాట్లాడుతూ ఫైనాన్స్ కంపెనీలు రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అప్పులు ఇచ్చి పేదలను వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. అలాంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. భట్టిప్రోలు మండలం వెల్లటూరు చెన్నకేశవ కాలనీకి చెందిన బాణావత్ పార్వతి బాయి అనే గిరిజన మహిళ ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో తమ ఇంటి పట్టా తాకట్టుపెట్టి రూ.రెండు లక్షల రూపాయలు రుణం తీసుకున్నట్లు తెలిపారు. అప్పును వాయిదా పద్ధతుల్లో చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రెండు, మూడు వాయిదాలు చెల్లించలేదని తెలిపారు. ఆ కంపెనీ సిబ్బంది ఆమె ఇంట్లోని సామగ్రిని తీసుకెళ్లినట్లు తెలిపారు. వారం క్రితం ఆమెను దారుణంగా హింసించినట్లు తెలిపారు. అవమానం తాళ్లలేక పార్వతిబాయి ఈ నెల 8న తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. పార్వతి బాయి మృతికి కారణమైన ఫైవ్ స్టార్ కంపెనీ నుంచి ఆమె కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇప్పించాలన్నారు. కంపెనీ సిబ్బంది ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జి.సుధాకర్, మండల కమిటీ సభ్యులు ఎం. సత్యనారాయణ, కె. రామస్వామి, పి. మనోజ్, కొల్లూరు మండల కార్యదర్శి వి. వెంకట్రామయ్య పాల్గొన్నారు.
