ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్ : ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కోరాపుట్ జిల్లా బందుగాం బ్లాక్ నీలావడిలో ప్రఖ్యాతిగాంచిన అగ్ని గంగమ్మ జాతర ఆది, సోమ, మంగళ వారాల్లో జరగనున్న దృష్ట్యా మొదటి రోజు ఆదివారం, అగ్ని గంగమ్మను దర్శించుకోవడానికి భక్తులు పోటీపడ్డారు. ఉత్తరాంధ్రకు చెందిన ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఒడిశా, చత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ మూడు రోజులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. లక్షలాది మంది తరలివచ్చే ఈ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని స్థానిక తహశీల్దార్ మోనాలిసా మిశ్రా తెలిపారు. పోలీసులతో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు తాగునీరు, వసతి వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బడే సత్యనారాయణ తెలిపారు. ఈ జాతరను దర్శించుకునేందుకు స్థానిక ఆర్టీసీ డిపో నుంచే రోజుకు ఆరు బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కనకదుర్గ తెలిపారు.
