పల్నాట ఆరని మంటలు

May 15,2024 00:29

ప్రజాశక్తి – కారంపూడి : ఎన్నికల పోలింగ్‌ అనంతరమూ పల్నాడులో ప్రశాంతత కరువుగానే మారింది. మండల కేంద్రమైన కారంపూడిలో మంగళవారం వైసిపి, టిడిపి గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తి మూడు గంటల పాటు భయానక వాతావరణం నెలకొంది. ఇరుపక్షాలు పరస్పరం రాళ్లు రువ్వుకోండంతోపాటు కార్యాలయాలనూ ధ్వంసం చేసుకున్నాయి. కర్రలు, రాడ్లతో దాడులు చేసుకున్నారు. ఘర్షణను నివారించే క్రమంలో సిఐ తలకు సైతం గాయాలయ్యాయి. ఓ పార్టీకి చెందిన వారి ఇంటిని మరోపార్టీకి చెందిన వారు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. దీంతో భాధితుణ్ణి పరామర్శించేందుకు నాయకుడు వస్తున్నాడని తెలిసి ఆ పార్టీకి చెందిన వందమంది వరకు స్థానిక కారంపూడి-మాచర్ల ప్రధాన రహదారిలోని మంగళవారం సుమారు మధ్యాహ్నం 3 గంటలప్పుడు నిలబడ్డారు. అదేసమంలో అటుగా వచ్చిన 20 మంది ప్రత్యర్థి పార్టీ వారు తమ పార్టీ, నాయకునికి జై కొడుతూ జనంలోకి వెళ్లారు. దీంతో ఆగ్రహానికి గురైన అక్కడున్నవారు వీరిపై దాడి చేశారు. అక్కడిని వెళ్లిన ఒక పార్టీ వారు తర్వాత మరింతమందిని సమీకరించుకుని అదే ప్రదేశానికి వచ్చారు. దీంతో ఘర్షణ ముదిరింది. ఇరుపక్షాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఆయా పార్టీల శ్రేణులు పరస్పరం తమ కార్యాలయాలను ధ్వంసం చేసుకున్నారు. దుర్గి మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ కారు, వైఎస్‌ఆర్సిపి బీసీ నాయకుడికి సంబంధించిన ద్విచక్ర వాహనాలను దహనం చేసుకున్నారు. ఘర్షణ నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన వారు కర్రలు, రాడ్లు పట్టుకుని ప్రధాన వీధుల్లో పరుగెత్తడం, రాళ్లు రువ్వుకోవడంతో స్థానికంగా రెండుమూడు గంటలపాటు భీకరంగా పరిస్థితి తయారైంది. పలువురు భయంతో ఇళ్ల తలుపులేసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. సమాచారం అందుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ కారంపూడికి చేరుకున్నారు. మూడు గంటలకుపైగా ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. ప్రత్యేక బలగాలతో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. మరోవైపు పరామర్శకని వచ్చిన నాయకుణ్ణి పోలీసులు ముందుగానే ఆపి పరిస్థితిని వివరించి వెనక్కు పంపారు.

➡️