బాణాసంచా..ధరల మోత…

ప్రజాశక్తి-రాయచోటి/రాజంపేట అర్బన్‌ బాణాసంచా ధరలు ఆకాశానంటుతుండటంతో అన్నమయ్య జిల్లాలో దీపావళి సందడి ఎక్కడా కనిపించడం లేదు. గతంలో వారం, పది రోజుల ముందుగానే దీపావళి వాతావరణం కనిపించేది. వ్యాపారుల క్రాకర్స్‌ అమ్మకాలతో రాయచోటి పట్టణం, మండలాలు నిండిపోయేది. ఈసారి దీపావళి పండుగ సమీపిస్తున్నా ఎక్కడా సందడి వాతావరణం కన్పించడం లేదు. జిల్లా వ్యాప్తంగా తాత్కాలిక షాపులకు 303 అనుమతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పట్టణంలోని గాలివీడు రోడ్డులోని మైదానంలో 39 దుకాణాలు ఏర్పా టు చేశారు. గత సంవత్సరం రాయచోటి జిల్లా కేంద్రం కావడంతో అధిక శాతం లైసెన్సు ఛార్జీలు పెంచారు. నేడు, రేపు ఈ దుకాణాలన్నీ ఆయా చోట్ల నడుపు కోవాల్సి ఉంటుంది. వ్యాపారుల్లో లైసెన్సు ఫీజులను భారీగా పెంచేయడంతో గత ఏడాది రోజుకు రూ.500 స్ధలానికి బాడుగ ఉండేది. ఇప్పుడు రోజుకు రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. భారీ స్థాయిలో పెంచేశారంటూ పలువురు బాణసంచా వ్యాపారులు తీవ్ర ఆవేదనకు వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసి స్టాల్స్‌ ఏర్పాటు చేసుకుంటున్నాం అంటు న్నారు. గతంలో అత్యంత తక్కువ ధరలకు చైనా నుంచి బాణసంచాలు నాణ్యతని వచ్చేవి. ఈ సారి చైనా బాణసంచా తయారీని ఆ దేశంలో నిషేధించడంతో పూర్తిగా స్వదేశీ బాణసంచా అమ్మకాలే చేస్తున్నారు. బాణసంచా ధరలు ఈ ఏడాది 20 శాతం పెరిగాయి, ఈ మొత్తం భారం ప్రజలపైనే పడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై స్పందించి సరైన ధరలకు బాణాసంచాల అమ్మకాలు చేసే విధంగా చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఫైర్‌ స్టేషన్‌వారీగా షాపులకు అనుమతులు జిల్లా వ్యాప్తంగా 303 తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేశారు. రాయచోటి ఫైర్‌ స్టేషన్‌ పరిధిలో 39, లక్కిరెడ్డిపల్లి 18, రాజంపేట 60, రైల్వే కోడూరు 63, మదనపల్లి 45, పీలేరు 41, మొలకలచెరువు 23, వాల్మీకిపురం 14 తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేశారు.భద్రత ప్రమాణాలు పాటించని దుకాణదారులు పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలు సూచించిన విధంగా కాక రాజంపేటలో ప్రమాణాలకు తిలోదకాలు వదులుతూ విచ్చలవిడిగా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. ప్రతి దుకాణానికి నిర్ణీత దూరం పాటించకపోవడమే కాక దుకాణాలాన్నీ ఒకేచోట మూకుమ్మడిగా ఉండడంతో ఒకచోట ప్రమాదం సంభవించినా చుట్టూ వ్యాపించి ఘోర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అనుకోని ప్రమాదాలు సంభవిస్తే ఎదుర్కోవడానికి మంటలను అదుపు చేసే గ్యాస్‌, ఇసుక, నీరు వంటి ఏర్పాట్లు అసలే లేకపోవడంతో అనుకోని ప్రమాదం సంభవిస్తే ఘోర నష్టం వాట్లిల్లే అవకాశం లేకపోలేదు.అధికారుల చర్యలు శూన్యం టపాసుల దుకాణాదారులు విచ్చలవిడిగా అధిక ధరలకు విక్రయిస్తున్నా, అధికారులు సూచించిన ప్రమాణాలు పాటించకున్నా పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో అధికారుల తీరుపై ప్రజలు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అధిక ధరలను నియంత్రించి, టపాసుల విక్రయ కేంద్రాలలో భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టి సామాన్యులు సైతం దీపావళిని ఆనందంగా జరుపుకునేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం వ్యాపారస్తులు ఎవరైనా అధిక రేటుకు అమ్ముతున్నారని ప్రజలు ఫిర్యాదు చేస్తే రెవెన్యూ, పోలీస్‌, తమ అగ్నిమాపక సిబ్బందితో కలిసి చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దీపావళి పండుగ ప్రశాంతంగా నిర్వహిం చుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాం.-పి.అనీల్‌ కుమార్‌, జిల్లా అగ్నిమాపక అధికారి, రాయచోటి.

➡️