పన్నుల్లో ఫస్ట్‌…సేవల్లో లాస్ట్‌

May 14,2024 21:59

ప్రజాశక్తి-పాలకొండ : గతంలో మేజర్‌ పంచాయితీగా ఉన్న పాలకొండను 2013లో నగరపంచాయతీగా మార్చారు. నగరపంచాయితీగా మారిస్తే పన్నుల బాదుడు ఎక్కువగా ఉంటుందని, ఎటువంటి అభివృద్ధి లేని పాలకొండ పట్టణాన్ని నగరపంచాయతీగా మార్చడం వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం పెరగడం తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని అప్పట్లో ఈ మార్పును సిపిఎం, సిపిఐ వామపక్షాలు, మేధావులు, వివిధ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఇవన్నీ బేఖాతరు చేస్తూ అప్పటి ప్రభుత్వం పాలకొండ మేజర్‌ పంచాయతీని నగర పంచాయితీగా మారుస్తూ తీర్మానం చేశారు. నగరపంచాయుతీగా మారితే పన్నుల పోటు అధికంగా ఉంటుందని ప్రజల్లో ఉన్న భావన నిజమవ్వడానికి ఎంతో కాలం పట్టలేదు. పాలకొండ పట్టణాన్ని ఆరు జోన్లుగా విభజిస్తూ బాదుడు షురూ చేశారు. మేజర్‌ పంచాయతీ కాలంలో వందల్లో చెల్లించిన పన్నులు వేలల్లోకి మార్చారు. దీనిపై వామపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్ర నిరసనలు చేశాయి. కానీ పెంపుదల మాత్రం ఆగలేదు. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరమైన విశాఖపట్నంతో పన్నుల బాదుడుతో పాలకొండ పోటీ పడుతుందని, వాస్తవంగా చెప్పాలంటే విశాఖపట్నం కంటే కూడా పాలకొండలో పన్నులు ఎక్కువని ప్రజల్లో ఒక ఆవేదన ఉంది. పట్టణంలో పన్ను వసూళ్లలో జనరల్‌ టాక్స్‌, లైబ్రరీ టాక్స్‌, మురుగు టాక్స్‌, లైటింగ్‌ టాక్స్‌, వాటర్‌ టాక్స్‌, డ్రైనేజీ టాక్స్‌ ఇలా అన్ని రకాల పన్నులు కలిపి రూ.కోటీ 70లక్షల వరకు ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారు. పన్నుల వసూళ్లలో ప్రయివేట్‌ ఏజెంట్ల మాదిరి వ్యవహరిస్తున్నారనే అపవాదం మూట కట్టుకున్నారని ప్రజలే చర్చించుకుంటున్నారు. జనవరి నుంచి సచివాలయ ఉద్యోగులు పెండింగ్‌ పన్నుల వసూలు కోసం రోడ్డు ఎక్కి ఇంటింటికి వెళ్లి పన్ను వసూలు చేసే బాధ్యత తీసుకుంటున్నారని చెప్పొచ్చు. పన్నుల వసూళ్లలో ఇంత శ్రద్ధ చూపినందుకు గతంలో పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది పాలకొండ నగరపంచాయితీ. గత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానంలో పాలకొండ నిలవడం గొప్పగా చెప్పుకుంటున్నారు. అలా అని అభివృద్ధిలో, మౌలిక సదుపాయాల విషయంలో రాష్ట్రంలో పాలకొండ నగరపంచాయతీ స్థానం ఎక్కడ అంటే చెప్పలేని పరిస్థితి. నగరపంచాయితీగా మారిన తర్వాత పాలకొండ రూపురేఖలు ఏమైనా మారిపోయాయా అంటే అలా కూడా జరగలేదు. పారిశుధ్యం విషయంలో చాలా అధ్వాన్నంగా ఉంది ఇక్కడి పరిస్థితి. రాష్ట్రంలోనే పన్ను వసూళ్లలో ప్రథమ స్థానంలో నిలిచిన పాలకొండ నగరపంచాయితీకి శాశ్వత డంపింగ్‌ యార్డ్‌ అనేదే లేదు. గతంలో తాత్కాలిక డంపింగ్‌ యార్డుగా కొత్తవీధి పరిసరాల్లో ఉన్న చెరువు దగ్గర స్థలాన్ని గుర్తించి అక్కడ చెత్త వేస్తున్నారు. మొదట్లో ఇక్కడ చెత్త వెయ్యకండి అని అడ్డు చెప్పిన స్థానికులను ఈ డంపింగ్‌ యార్డ్‌ తాత్కాలికమే. కొన్ని నెలల్లోనే ఇక్కడి నుంచి డంపింగ్‌ యార్డ్‌ తరలిస్తామని హామీ ఇచ్చి ఒప్పించారు. కార్యాచరణకు వచ్చేసరికి నెలలు కాస్త సంవత్సరాలు గడిచిపోయాయి. సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం ఇంతవరకు చూపలేదు. ఇక లైబ్రరీ టాక్స్‌ విషయానికొస్తే పట్టణంలోని లైబ్రరీ నగరపంచాయితీ ఎదురుగానే ఉంది. అక్కడకు వెళ్లటానికి కూడా సరైన రహదారి లేదు. చుట్టుపక్కల మురుగు నీరు, చెత్తతో కలగలిసి ఉన్న లైబ్రరీని కనీసం బాగు చేసే పని కూడా చేయరు. ఈ లైబ్రరీలోలో ప్రతి ఏటా చదువుకునే పిల్లలకు వేసవి సెలవుల్లో డ్రాయింగ్‌, పెయింటింగ్‌ ఇలా చాలా విషయాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. కానీ చుట్టుపక్కల ఉన్న అపరిశుభ్రత వల్ల తమ పిల్లలకు ఏం రోగాలు వస్తాయోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని వెంకటరాయుని కోనేరును పార్కుగా తీర్చిదిద్దుతామని చెప్పిన మాటలు ప్రతి ఎన్నికల్లో హామీ రూపంలోనే ఉంటుంది. ఆచరణలోకి మాత్రం రావడం లేదు. రైతు బజార్‌ శంకుస్థాపన స్థాయిలో ఉంది. ప్రధాన రహదారిని విస్తరించి సెంటర్‌ లైటింగ్‌తో అభివృద్ధి చేస్తామనే హామీ రోడ్డు కోసం కొలతలు వేసిన దగ్గరే ఆగిపోయింది. ఇంటింటికి కుళాయి అనే పథకం పూర్తిగా పడకేసిందనే చెప్పాలి. పట్టణంలో ప్రధాన రహదారి కాకుండా నిత్యం రద్దీగా ఉండే ముఖ్య రహదారులు మరో 5 ఉన్నాయని చెప్పవచ్చు. మార్కెట్‌ రోడ్డు, కోటదుర్గమ్మ ఆలయం వెనక నుంచి లంబూరు వరకు ఉన్న రహదారి, స్థానిక ఆంజనేయ సెంటర్‌ నుంచి వడమ వెళ్లే రహదారి, అక్కడి నుండే హాస్పిటల్‌కు వెళ్లే రహదారి, గాంధీ బొమ్మ సెంటర్‌ మీదుగా దేవరపేట వైపు వెళ్లే రహదారులు ఐదు కూడా నిత్యం విపరీతమైన ట్రాఫిక్‌ రద్దీతో కిటకిటలాడుతాయి. పండగ సమయంలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దారుల్లో కాలువలు సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల వర్షం వస్తే కాలువలు పొంగి మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే పట్టణంలో సమస్యలు చాలా ఉన్నాయి. పన్ను వసూళ్లలో పాలకొండను ప్రథమ స్థానంలో నిలిపిన నగరపంచాయతీ అధికారులు ఇకనైనా ప్రజా సమస్యలు పరిష్కరించి అభివృద్ధి, సేవలందించడంలో పాలకొండను పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️