మొదట ప్రాధాన్యత ఓటువేసి గెలిపించండి

Feb 4,2025 21:18

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పిడిఎఫ్‌ అభ్యర్థి విజయగౌరి

ప్రజాశక్తి-నెల్లిమర్ల  : ఉపాధ్యాయులు తనకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి ఎమ్మెల్సీగా గెలిపిస్తే విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పిడిఎఫ్‌ అభ్యర్థి కె.విజయగౌరి అన్నారు. యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి పతివాడ త్రినాధ్‌, మండల కమిటీ అధ్యక్షుడు మద్దిల సత్యనారాయణ తదితరులతో కలిసి నెల్లిమర్ల పట్టణంలో మంగళవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈనెల 27న నిర్వహించనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు తనకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరారు. ప్రజా వ్యతిరేక సంస్కరణలు, విధానాలను ఎదురించి అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన పీడీఎఫ్‌ తరపున పోటీ చేస్తున్న తనకు అన్ని సంఘాల ఉపాధ్యాయులు మద్దతు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిఆర్‌సి కమిటీ వేసి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యాయులపై బోధనేతర పనులు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులపై ఆన్‌లైన్‌ యాప్‌ల భారంతో విద్యాబోధనకు తీవ్రమైన ఆటంకం ఏర్పడుతుందన్నారు. వారిని బోధనకే పరిమితం చేయాలని కోరారు. అందరికీ కామన్‌ సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలని చెప్పారు. సిపిఎస్‌, 117 జీఓ రద్దు తదితర సమస్యలను తమ మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు విజయగౌరి పేర్కొన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఈనెల 9 నుంచి పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శిలెంక సన్యాసి నాయుడు, సహాధ్యక్షులు వంగపండు సురేష్‌ బాబు పాల్గొన్నారు.

➡️