తీరం చేరుకున్న మత్స్యకారులు

Apr 3,2024 21:39

 ప్రజాశక్తి -భోగాపురం  : విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభ్యమయింది. వారంతా బోల్తాపడిన తెప్పపైనే ఎక్కి అప్పికొండ బీచ్‌ వద్దకు చేరుకోవడంతో అధికారులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ముక్కాం గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు సోమవారం వేటకు వెళ్లి మంగళవారం సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో వాళ్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వారి ఫిర్యాదు మేరకు కోస్ట్‌ గార్డ్‌ పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలో బుధవారం వేకువ జామున అప్పికొండ తీరం వద్దకు ఈదుకుంటూ వారంతా చేరుకున్నారు. అక్కడ స్థానికులు వారిని చేర దీశారు. ఈసందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ సముద్రంలో అలల తాకిడికి తెప్ప బోల్తా పడినట్లు తెలిపారు. బోల్తా పడిన తెప్పను యథాస్థితికి తెచ్చేందుకు ప్రయత్నించగా కుదరలేదని, దీంతో వలలు దాచుకునే కవర్‌ సహాయంతో తీరానికి చేరుకున్నట్లు వీరు తెలిపారు. వీరిని గ్రామ సర్పంచ్‌ భర్త వాసుపల్లి రెయ్యుడు పరామర్శించారు. ఈ సంఘటనలో ప్రాణాలతో ఒడ్డికి చేరుకున్నప్పటికీ తెప్పతో పాటు విలువైన వలలు పోయాయని తెప్ప యజమాని తెలిపారు. సుమారు 5 లక్షలు నష్టం వాటిళ్లినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. తీరానికి క్షేమంగా చేరుకొని అల్పాహారం చేస్తున్న మత్స్యకారులు

➡️