- ద్విచక్రవాహనాలను ఢకొీట్టిన కర్ణాటక ఆర్‌టిసి బస్సు
- ఐదుగురు దుర్మరణం
- మృతుల్లో భార్యాభర్తలు
ప్రజాశక్తి- ఆదోని రూరల్ (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లు గ్రామ సమీపంలో అతివేగంగా వెళ్తున్న కర్ణాటక ఆర్‌టిసి బస్సు రెండు బైకులపైనుంచి దూసుకెళ్లడంతో ఇద్దరు భార్యాభర్తల సహా ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉన్నారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం… కర్ణాటక రాష్ట్రం గంగావతి డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు ఆదోని నుంచి రాయచూర్‌కు అతివేగంగా వెళ్తూ అదుపు తప్పి ముందు వెళ్తున్న రెండు బైకులను బలంగా కొట్టింది. దీంతో, ఒక బైక్‌పై కుప్పగల్ నుంచి ఆదోని వస్తున్న కురువ ఈరన్న (25), ఆయన భార్య ఆదిలక్ష్మి (20) అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకో బైక్‌పై వెళ్తున్న కర్ణాటక రాష్ట్రం మాన్వికి చెందిన హేమాద్రి (40), ఆయన భార్య నాగరత్న (35) దుర్మరణం పాలయ్యారు. తీ వ్రంగా గాయ పడిన వారి కుమారుడు దేవ రాజు (22) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనా స్థలిని డిఎస్‌పి మర్రిపాటి హేమలత, తాలూకా సిఐ నల్లప్ప,పెద్దతుంబలం ఎస్‌ఐ మహేష్ కుమార్ పరిశీలించారు.
మృతదేహాలను ఆదోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఘటనా స్థలానికి కర్నూలు జిల్లా ఎస్‌పి విక్రాంత్ పాటిల్ చేరుకుని వివరాలు సేకరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు. గంగావతి డిపోకు చెందిన కర్ణాటక బస్సు డ్రైవర్ మహబూబ్ బాషాపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.