- న్యాయం చేయాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన
- మద్దతు తెలిపిన సిపిఎం నేతలు
ప్రజాశక్తి – విజయవాడ : ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వరద బాధితులు శనివారం నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తులతో కలెక్టరేట్ వద్దకు వచ్చిన బాధితులను అధికారులు గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో బాధితులు ఆగ్రహంతో నిరసనకు దిగారు. బుడమేరు, కృష్ణానది వరదలతో సర్వస్వం కోల్పోయి 28 రోజులు గడిచినా నేటికీ తమకు న్యాయం జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్యుమరేషన్‌లో తమ పేర్లు నమోదు కాలేదని, నమోదైన వారికి డబ్బు విడుదల కాలేదని, డబ్బులు విడుదలైనా తప్పుగా నమోదు చేశారని, ఇలా పలు సాకులతో బ్యాంకులో డబ్బులు ఇవ్వడం లేదని ఆందోళన చేపట్టారు. ఎన్యుమరేషన్ తప్పులు తడకగా ఉందని, లోపాలను గుర్తించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ తదితరులు మద్దతు తెలిపారు. బాధితుల సమస్యలను కలెక్టర్, ఇతర అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. బాధితుల దరఖాస్తులు తీసుకొని విచారించి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సిహెచ్.బాబురావు, డివి.కృష్ణ మాట్లాడారు. వరద బాధితులకు నష్టపరిహారం విషయంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వం చెబుతున్న మాటలకు పొంతన ఉండడం లేదన్నారు. మళ్లీ సచివాలయాల వద్ద దరఖాస్తులు స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సాయాన్ని ప్రతి కుటుంబానికీ రూ.50 వేలకు పెంచాలని, అన్ని రకాల వాహనాలకు సహాయం అందించాలని, చిరు వ్యాపారులు, చిన్న, మధ్యతరగతి సంస్థలు, పరిశ్రమలకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. బాధితులకు మద్దతు తెలిపిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.శ్రీదేవి, పివి.ఆంజనేయులు, కోట కళ్యాణ్ ఉన్నారు.