విదేశీ విద్యార్థులు ‘గీతం రాయబారులు’

Jun 8,2024 00:12 #Gitam students convocation
Gitam students convocation

ప్రజాశక్తి-మధురవాడ : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో స్టడీ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రవేశాలు పొందిన వివిధ దేశాల విద్యార్థులను అంతర్జాతీయంగా గీతం పేరు ప్రఖ్యాతులను విస్తరింప చేసే గీతం రాయబారులుగా పరిగణిస్తామని విశ్వవిద్యాలయం గీతం ప్రో వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావు పేర్కొన్నారు. గీతంలో వివిధ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసుకుని స్వదేశాలకు తిరిగి వెళుతున్న విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పట్టభద్రుల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రణాళికాయతంగా చర్యలు తీసుకుంటోందని, చదువుతో పాటు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల ద్వారా తీర్చిదిద్దుతోందని చెప్పారు. విద్యార్థులు దేశానికి, సమాజానికి ఉపయోగపడేలా తమ మేధస్సును ఉపయోగించాలని పిలుపునిచ్చారు. స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ కెఎస్‌.కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విద్య, పరిశోధనల ద్వారా తమ దేశాలకు ప్రయోజనం కలిగించే మానవ వనురులుగా మారాలని కోరారు. గీతం అంతర్జాతీయ విద్యా వ్యవహరాల విభాగం డైరక్టర్‌ కెపిసి.కిషన్‌ మాట్లాడుతూ 25 దేశాలకు చెందిన 400 మంది విదేశీ విద్యార్థులు గీతం విశాఖ, హైదరాబాద్‌, బెంగళూరు ప్రాంగణాలలో వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది గీతం విశాఖ ప్రాంగణం నుంచి 51 మంది విదేశీ విద్యార్థులు ఇంజనీరింగ్‌, ఫార్మశీ, లా, సైన్స్‌, పారామెడికల్‌ కోర్సులతో పాటు మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తి చేసుకున్నారని తెలిపారు. కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రో వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావు, స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ కెఎస్‌.కృష్ణ సర్టిఫికెట్‌లను అందజేశారు. కార్యక్రమంలో గీతం న్యాయ కళాశాల డైరక్టర్‌ ప్రొఫెసర్‌ అనితారావు, స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ వేదవతి, నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వెంకటేశన్‌ బాలు తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

➡️