అటవి, రెవెన్యూ భూముల హద్దులు ఖరారు

Feb 5,2025 23:30

హద్దులు నిర్ణయిస్తున్న అటవి, రెవెన్యూ శాఖాధికార్లు
ప్రజాశక్తి – అచ్చంపేట :
తాళ్లచెరువు రెవెన్యూ పరిధిలోగల సర్వే నంబర్‌ 320 నుండి 337 వరకు పేదలకు డికే పట్టాలిచ్చిన భూముల పోరాటం కొలిక్కొచ్చింది. అటవి, రెవెన్యూ శాఖాధికారుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆ భూములను బుధవారం మళ్లీ పరిశీలించి అటవి, రెవెన్యూ శాఖల భూమలకు హద్దులు నిర్ణయించింది. డికె పట్టాలు పొందిన రైతులను భూముల్లోకి అటవీ శాఖాధికారులు అనుమతించని నేపథ్యంలో మూణ్ణెల్లకుపైగా రైతులు ఆందోళన బాటపట్టారు. రైతుసంఘం ఆధ్వర్యంలో అధికారులకు విన్నవించడం, రెవెన్యూ సదస్సుల్లో సమస్యలను వివరించడం వంటివి చేశారు. ఈ నేపథ్యంలో డిఆర్వో కుసుమకుమారి, ఎఫ్‌బిఓ యేసురత్నం, డిప్యూటీ తహశీల్దార్‌ జానీబాష, సర్వేయర్‌ యు.ఏడుకొండలు, వీఆర్వో శేషయ్య జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా హద్దులు నిర్ణయించారు. 1993 ఎఫ్‌ఎంబి చిత్రాల ప్రకారం డీకే పట్టా పొందిన రైతులకు కొలతలు వేసి పొజిషన్‌ చూపించాల్సి ఉంది. ఈ ప్రక్రియనూ త్వరగా పూర్తి చేయాలని రైతుసంఘం నాయకులు రావెల వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కెకె రెడ్డి కోరారు. కార్యక్రమంలో రైతులు సుంకర ఆదినారాయణ, వి.వెంకటేశ్వర్లు, దిబ్బయ్య, ఎస్‌.భానురావు, ఎస్‌.శేషమ్మ, కె.పద్మ, కె.నాగసంధ్య పాల్గొన్నారు.

➡️