12న ”ఫీజు పోరు” : రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికలకు ముందు కాకమ్మ కథలు చెప్పిన చంద్రబాబు… అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా కట్టుకథలు చెబుతున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైసీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ … ఈనెల 12న చేపట్టబోయే ”ఫీజు ఫోరు” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ”ఫీజు ఫోరు”కు సంబంధించిన పోస్టర్లను తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … పేద విద్యార్థులు ఉన్నత చదువుల కోసం జగనన్న ప్రభుత్వం పూర్తి ఫీజు రియంబర్స్మెంట్‌ పథకం ద్వారా అండగా నిలిచిందన్నారు. 2014-19 వరకు ఫీజు రియంబర్స్మెంట్‌ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు. ఈరోజు మళ్లీ అదే ఎజెండాగా చంద్రబాబు కొనసాగిస్తున్నారని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్‌ బకాయిలు విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రూ.3800 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటివరకు ఉద్యమాలు చేస్తూ పేద విద్యార్థులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ”ఫీజు పోరు” తో ప్రభుత్వ మెడలు వంచుతామన్నారు.

➡️