నినదించిన సిపిఎం జిల్లా మహాసభ
శ్రేణుల్లో సమరోత్సాహం
ప్రజలతో మరింత మమేకమై పనిచేయాలని నేతలు పిలుపు
ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి /కురుపాం : సిపిఎం పార్వతీపురం మన్యం జిల్లా 10వ మహాసభలు సమరోత్సాహంతో ముగిసాయి. రెండు రోజుల పాటు జరిగిన మహాసభలో జిల్లాలోని కీలక సమస్యలపైనా, ప్రభుత్వ విధానాల వల్ల ఈ ప్రాంతంలో ఉత్పన్నమవుతున్న ఆటంకాలపైనా కీలకంగా చర్చించారు. జిల్లా, రాష్ట్ర, దేశ రాజకీయాలు- ప్రజలపై వాటి ప్రభావం తదితర అంశాలను జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు ప్రతినిధులకు వివరించారు. ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడంతో పాటు కీలక సమస్యలపైనా పోరాడాలని మహాసభ నిర్ణయించింది. జిల్లా సమగ్ర అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించాలని సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. జిసిసి బలోపేతానికి, అటవీ హక్కుల చట్టం, ఉపాధి హామీ చట్టం పటిష్ట అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని, గిరిజన ప్రాంతంలో విద్య, వైద్యం, రోడ్లు తదితర సదుపాయాల మెరుగుకు ప్రభుత్వంపై పోరాడాలని మహాసభ నిర్ణయం చేసింది. కురుపాంలోని కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్, బుద్ధదేవ్ బట్టాచార్య ప్రాంగణం, సత్యనారాయణ రాజు వేదికగా (సాయి నందకి కల్యాణ మండపం) రెండు రోజులు పాటు జరిగిన సిపిఎం పార్వతీపురం మన్యం జిల్లా మహాసభలు అత్యంత ఉత్సాహ పూరితంగా ముగిశాయి. గత మూడేళ్లలో పార్టీ చేపట్టిన ఉద్యమాలు, విస్తరణ, ముఖ్యంగా గత ఎన్నికల్లో ప్రజలు పార్టీని అభిమానించిన తీరు తెన్నులు, ప్రజలకు పార్టీ తరపున అందించిన సహకారం తదితర అంశాలను జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు తన నివేదిక ద్వారా సభకు తెలియజేశారు. వీటిపై రంగాలు, ప్రాంతాలు వారీగా ప్రతినిధులు చర్చించి తమ అభిప్రాయాలను తెలియజేశారు. వీటితోపాటు జిల్లాలోని సమస్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి ప్రభావం తదితర అంశాలపె చర్చించారు. పాలక పార్టీల నిర్లక్ష్యం వల్లే జిల్లా అత్యంత వెనుకబడిందని, ఈ నేపథ్యంలో పాలకులు అనుసరిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించాలని సభ నిర్ణయించింది. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను దెబ్బతీసి, వారి మధ్య విభేదాలు సృష్టించి, తద్వారా ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తీసుకోవాలని మహాసభ తెలిపింది. మహాసభలో 23 అంశాలపై వివిధ రంగాలకు చెందిన నాయకులు పెట్టిన తీర్మానాలను ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రజా పోరాటాలకు ఎర్ర జెండా నిరంతరం అండగా నిలుస్తుందని పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ అన్నారు. ఇందుకోసం ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఐక్య ఉద్యమాలకు సిద్ధం కండి : పుణ్యవతిఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గతంలో మన్యం జిల్లాలో తోటపల్లి నిర్వాసితుల ఉద్యమం సహా అనేక పోరాటాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని గుర్తు చేశారు. ఒకప్పుడు అనేక నిర్బంధాల నడుమ అటు పార్టీని విస్తరించడంతోపాటు ఇటు ప్రజా ఉద్యమాలను కూడా ముందుకు సాగించామని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న నేపథ్యంలో ప్రజలను మరింత అప్రమత్తం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చాక మతతత్వ శక్తులు పెట్రేగుతున్నాయని, తద్వారా ప్రజల మధ్య చీలికలు తెస్తున్నాయని అన్నారు. వీటిని ఎదుర్కొనేందుకు ప్రజా సమస్యలను అజెండా చేసి ప్రజలను సమీకరించడమే మార్గమని అన్నారు. స్థానిక సమస్యలపై అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించి ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. వామపక్ష ఐక్యతతోప్రజా సమస్యల పరిష్కారం సిపిఐ జిల్లా కార్యదర్శి మన్మథరావు వామపక్షాల ఐక్య పోరాటాలతోనే ప్రజలకు మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుందని సిపిఐ మన్యం జిల్లా కార్యదర్శి కోరంగి మన్మధరావు అన్నారు. పార్టీలు వేరైనా సిపిఎం, సిపిఐ తదితర వామపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో అంతా కలిసికట్టుగా ఉంటామని అన్నారు. పాలక పార్టీలన్నీ ఏకమై గుత్త పెట్టుబడిదారులకు సేవ చేస్తున్నాయని, దేశ సంపాద సైతం దోచిపెడుతున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఒక్క ప్రభుత్వాలపైనే కాకుండా పాలక పార్టీలన్నింటినీ ఎండగట్టేందుకు కమ్యూనిస్టులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఇవీ మహాసభ ఆమోదించిన తీర్మానాలు
గిరిజనులు సాగుచేసే జీడి పిక్కలను ఐటిడిఎ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. మద్దతు ధర కల్పించాలి. స్థానికంగా జీడి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. ఖీ అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాల వరకు పోడు భూమిపై హక్కు కల్పించాలి.
ఏజెన్సీలో తగినన్ని ఆసుపత్రులు ఏర్పాటు చేసి, వాటిలో పూర్తి స్థాయిలో వైద సిబ్బందిని నియమించాలి.అన్ని రకాల జబ్బులకూ మందులను అందుబాటులో ఉంచాలి
ప్రపంచ బ్యాంకు విధానాల్లో భాగంగా గిరిజన ప్రాంతంలో మూసివేసిన పాఠశాలలను పునరుద్ధరించాలి. జిల్లాలో తలపెట్టిన గిరిజన యూనివర్సిటీని త్వరితగతిన పూర్తి చేయాలి. ఎంఎ, ఎంఎస్‌సి వంటి పీజీ కోర్సులు జిల్లాలో అందుబాటులో ఉండే విధంగా యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి. ఏజెన్సీలో సవర సవర భాష విద్యా వాలంటీర్లను కొనసాగించి వారికి వేతనాలు క్రమం తప్పకుండా చెల్లించాలి.
జిల్లాలో సాగునీటి వనరులు పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చే వరకు ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలి. ముఖ్యంగా నిధులు కేటాయించే విధంగా పోరాడాలి. ఖీ గిరిజన ప్రాంతంలోని ఏనుగుల విధ్వంసం నుంచి ప్రజల్ని రక్షించేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి కుటుంబానికి ఏటా 200 రోజులు పని గ్యారంటీగా కల్పించాలి. కనీస వేతనం రూ. 600 చెల్లించాలి.
మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. ఇందుకోసం మాదకద్రవ్యాలను, మద్యాన్ని నియంత్రించాలి.
సాగునీటి ప్రాజెక్టులు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు తదితర ప్రభుత్వ అవసరాల కోసం సేకరించిన భూమి వల్ల నష్టపోయిన నిర్వాసితులకు మెరుగైన పరిహారం, పురావాసం కల్పించాలి
కళాకారులకు మన్యం జిల్లా పుట్టినిల్లు. జనజీవన సంస్కృతికి జానపద కళలు పట్టుగొమ్మలు. ఈ నేపథ్యంలో కళాకారులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకోవాలి.
పూర్ణపాడు -లాబేసు వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేసి, రహదారి సదుపాయాన్ని కల్పించాలి. ఖీ మూసివేసిన జీగిరాం జ్యూట్ మిల్లును వెంటనే తెరిపించి కార్మికులకు ఉపాధి పునరుద్ధరించాలి.
లచ్చయ్యపేట ఎన్‌సిఎస్ సుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి. దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపించడం ద్వారా చెరుకు రైతులను ఆదుకోవాలి.
పూర్తిగా గిరిజనులు ఉన్న గ్రామాలను 5వ షెడ్యూల్ ఏరియాలో కలపాలి.
నిత్యావసర ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం యత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి.
పట్టణంలో చెత్త పన్ను, నీటి పన్ను, విలువ ఆధారిత పన్ను తదితర రూపాల్లో ప్రజలపై వేసిన భారాలను తగ్గించాలి. పౌర సేవలను మరింతగా మెరుగుపరచాలి.
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు, సాగునీటి వనల అభివద్ధి వంటి చర్యలు తీసుకోవడం ద్వారా జిల్లాలో వలసలను నివారించాలి.
జిల్లాలో స్కీం వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి, పని ఒత్తిడి తగ్గించాలి.
జీవో నెంబర్ 3ను పునరుద్ధరించి గిరిజన యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచాలి.
సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు
19 మందితో జిల్లా కమిటీ
మహాసభలో జిల్లా నూతన కమిటీ 19 మందితో ఎన్నికైంది. వీరంతా ఆరుగురిని కార్యదర్శివర్గంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా కొల్లి గంగునాయుడు, కార్యదర్శివర్గ సభ్యులుగా ఎం.తిరుపతిరావు, కోలక అవినాష్, వి.ఇందిర, ఎన్‌వై నాయుడు, కె.రామస్వామి ఎన్నికయ్యారు. జిల్లా కమిటీ సభ్యులుగా కార్యదర్శి, కార్యదర్శివర్గ సభ్యులతో పాటు రెడ్డి వేణు, రెడ్డి శ్రీదేవి, డి.రమణారావు, జి.తిరుపతిరావు, ఎం.శ్రీనివాసరావు, కె.కృష్ణమోహన్, ఎం.రమణ, ఎ.భాస్కరరావు, కె.సాంబమూర్తి, పి.రాజశేఖర్, కె.ఈశ్వరరావు, బివి రమణ, జి.వెంకటరమణ, కోఆప్షన్ సభ్యుడు ఒకరున్నారు.