టిడిపిలోకి మరో నలుగురు కౌన్సిలర్లు

Jan 22,2025 23:13

కౌన్సిలర్లును పార్టీలోకి ఆహ్వానిస్తున్న జీవీ ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు తదితరులు
ప్రజాశక్తి – వినుకొండ :
రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన తరుణంలో ఉన్నామని, పార్టీలో చేరేవారందర్నీ అక్కున చేర్చుకుంటామని ప్రభుత్వ చీఫ్‌విప్‌, వినుకొండ ఎమ్మెల్యే జీవీ అంజనేయులు అన్నారు. వైసిపికి చెందిన నలుగురు కౌన్సిలర్లు బుధవారం స్థానికి టిడిపి కార్యాలయంలో టిడిపిలో చేరారు. గత స్థానిక ఎన్నికల్లో 32 వార్డులకుగాను వైసిపి 28 స్థానాలు, టిడిపి 4 స్థానాలు గెలవగా శాసన సభ ఎన్నికలకు ముందు ఇద్దరు కౌన్సిలర్లు టిడిపిలో చేరారు. ఇప్పుడు 4, 11, 20, 11 వార్డుల కౌన్సిలర్లు అయిన మహదేవ జమున ఇందుమతి, క్రిష్టం బ్రహ్మయ్య, నంది అంజలి, గర్రె శ్రీనివాసరావు చేరడంతో కౌన్సిల్లో టిడిపి బలం 10కి పెరిగింది. వీరితోపాటుమాజీ కౌన్సిలర్‌ పులిపాటి రామారావు, నంది నరసింహారావు, 2వ సచివాలయం మహిళా కన్వీనర్‌ లక్ష్మీసామ్రాజ్యం, గోళ్ల రాజులు, దొంతు ఆంజనేయులు టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ పార్టీలోకి వచ్చిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని, రామలింగేశ్వరస్వామి ఆలయం, ఘాట్‌ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఇంటింటికీ తాగునీరు అందిస్తామని, శాశ్వత తాగునీటి పథకానికి పరిష్కారం చూపిస్తామని, స్టేడియం, షాదీఖానా, పార్క్‌, టిటిడి కళ్యాణమండపం పూర్తి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు ఆయుబ్‌ఖాన్‌ పాల్గొన్నారు.

➡️