బుక్ చేయకుండానే ఇంటికి వస్తువులు
అక్రమాలపై ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానం
ఆటోనగర్ ఇన్‌స్టాకార్ట్ సర్వీసెస్ నిర్వాకం
లబోదిబోమంటున్న బాధితురాలు
ప్రజాశక్తి -గాజువాక : బుక్ చేయకుండానే ఇంటికి ఏవేవో వస్తువులను డెలివరీ చేసి, బలవంతంగా డబ్బులు వసూలుచేసి, తీరా మోసాన్ని గుర్తించి ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానం.. ఇదీ గాజువాక ఆటోనగర్‌లోని ఇన్‌స్టాకార్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాకం. దీనికి సంబంధించిన వివరాలివి. గాజువాక శ్రీనగర్ నక్షత్ర టవర్‌లో నివాసముంటున్న వనజారావు అనే మహిళకు ఈనెల 9 ఆన్‌లైన్‌లో డెలివరీ వచ్చింది. తాను బుక్ చేయకుండానే వస్తువులు రావడమేంటని అనుమానం వ్యక్తం చేసిన ఆమె, దానిపై ఇన్‌స్టా కార్డ్ సర్వీసెస్‌కు చెందిన డెలివరీ బారును ప్రశ్నించగా, తెలిసిన వారెవరో బుక్ చేసి ఉంటారని చెప్పి తొందర చేయడంతో అయిష్టంగానే ఫోనుపేలో రూ.1018 చెల్లించి పార్శిల్ తీసుకున్నారు. తెరిచి చూసేసరికి డబ్బులకు సరిపడా వస్తువులు లేకపోవడంతోపాటు బుకింగ్‌తో తమకు సంబంధం లేదని గుర్తించి, మంగళవారం ఆటోనగర్‌లోని డెలివరీ సంస్థ కార్యాలయానికి వెళ్లి దీనిపై ఫిర్యాదు చేశారు. అక్కడున్న వ్యక్తి ఎక్కడినుంచి వచ్చాయో తమకు తెలియదని, డెలివరీ చేయడమే తమ బాధ్యత అంటూ నిర్లక్ష్యంగా, దురుసుగా సమాధానం చెప్పడంతో బాధిత మహిళ అవాక్కయ్యారు. ఎక్కడి నుంచి పార్శిల్ వచ్చిందో చెప్పాలని కోరినా పొంతన లేని సమాధానం చెప్పడంతోపాటు తామేమీ చేయలేయని చెప్పడంతో లబోదిబోమన్న బాధిత మహిళ తనకు జరిగిన మోసంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ బుకింగ్‌లు, డెలివరీలు పేరుతో ప్రజలను మోసపుచ్చుతున్న ఇటువంటి వ్యవహారాలపై ప్రభుత్వం, అధికారులు, పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
ప్రాధేయపడినా స్పందించలేదు
ఆన్‌లైన్ డెలివరీలో జరిగిన మోసంపై వివరాలు ఇవ్వాలని ప్రాధేయపడినా స్పందించలేదు. సరికదా నిర్లక్ష్యపు సమాధానంతోపాటు దాడిచేసేలా మాట్లాడారు. ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా ఉండాలంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తా.
వనజారావు, బాధితురాలు