ప్రజాశక్తి -ములగాడ : ఉచిత ఇసుక అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం మల్కాపురం గౌరవాధ్యక్షులు కె.పెంటారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జివిఎంసి 40వ వార్డు పరిధి ఎకెసి కాలనీలో, 63వ వార్డు పరిధి చింతల్లోవ కాలనీలో సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఎకెసి కాలనీలో సిపిఎం నాయకులు ఎ.సత్యారావు, చింతల్లోవలో కె.పెంటారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇసామని చెప్పి ధరను భారీగా పెంచారని విమర్శించారు. డబ్బులు కట్టినా కూడా ఇసుక అందుబాటులో లేదన్నారు. గతంలో టన్ను ఇసుక రూ.1000 ఉంటే నేడు రూ.1900కి పెరిగిందని తెలిపారు. భవన నిర్మాణ కార్మిక కుటుంబాలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇసుక మాఫీయా అక్రమార్జనలు పెరిగాయన్నారు. ఉచిత ఇసుక అమలుచేయాలని కోరుతూ ఈ నెల 4వ తేదీన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యాన చేపట్టే మహాధర్నాలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. క్రాంతినగర్‌లో ఎం.ఆదినాయణ, పి.రురేష్, గంటా సత్యనారాయణ, దాసరి సత్తిబాబు, ఎకెసి కాలనీలో ఎం.కోటేశ్వరరావు, నూకరాజు, ప్రకాష్, వరలక్ష్మి, పార్వతి పాల్గొన్నారు.