నిధుల వినియోగంలోనూ వెనుకబాటే

Apr 15,2025 21:11

  పడకేసిన పల్లె పండగ పనులు 

పశువుల శాలలు, ఫారం పాండ్స్‌ సగం సగం

ఉపాధి కూలీల కష్టార్జితం రూ.103 కోట్లు వృథా

ప్రజాశక్తి – విజయనరగం ప్రతినిధి : ఎలాగూ కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి జిల్లాకు నిధులు రాబట్టుకునే పరిస్థితి లేదు. కనీసం ఉపాధి కూలీల కష్టార్జితం సాధించిన నిధులను కూడా సద్వినియోగం చేసుకునేందుకు చొవర చూపలేదు. ఫలితంగా జిల్లాకు చెందిన రూ.103కోట్లు వృథాగా పోయినట్టే అయ్యింది. ఫలితంగా జిల్లాలో పల్లెపండ పేరిట చేపట్టిన రోడ్లు, కాలువలు, పశువులు శాలలు, ఫారం పాండ్స్‌ పనులు సగానికి సగం మాత్రమే జరిగాయి. గ్రామీణ జాతీయ ఉపాధి హామీలో భాగంగా పనులు చేపట్టిన కూలీలకు వచ్చిన సొమ్ముపై 2/3వ వంతు మొత్తాన్ని మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనులకు కేటాయించాల్సిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది 1.81కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 1.74కోట్ల పనిదినాలు (96.13శాతం) మాత్రమే ప్రభుత్వం కల్పించింది. లక్ష్యంకన్నా తక్కువగా పనులు చేయించడం బహుశా జిల్లా చరిత్రలో ఇదే తొలిసారి. దీన్ని బట్టి పనులు దొరక్క కూలీలు అవస్థలు ఉపడ్డారన్నది వేరేగా చెప్పనక్కర్లేదు. సుమారు మూడు నెలలుగా చేపడుతున్న 32వేల పనిదినాలకు రూ.67.51 కోట్ల మేర బకాయి కూడా ఉండడంతో కూలీలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్నారు. ఈ సంగతి పక్కనెబడితే గడిచిన ఆర్థిక సంవత్సరంలో కూలీలకు అందిన మొత్తంపై రూ.263.63కోట్ల మేర మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనులు (రోడ్లు, కాలువలు, పశువుల శాలలు, ఫారం పాండ్స్‌ తదితరాలకు వినియోగించాల్సి వుండగా కేవలం రూ.160.63కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. ఈ లెక్కన ఆర్థిక సంవత్సరం ముగియడం వల్ల మిగిలిన రూ.103కోట్లు వృథాగా పోయినట్టే. దీంతో, పంచాయతీ రాజ్‌ శాఖ ద్వారా జరగాల్సిన పల్లెపండగ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం… మొత్తం 4,135 పనులు మంజూరు చేయగా, 2,129 పనులు మాత్రమే ప్రారంభించారు. ఇందులోనూ 1,399 పనులు మాత్రమే పూర్తయ్యాయి. పశువులు, గొర్రెలు,మేకలు, కోళ్ల ఫారాలకు సంబంధించిన షెడ్లు 700 వరకు చేపట్టాలని లక్ష్యం తీసుకున్న ప్రభుత్వం, ఆచరణలో 1,993 మాత్రమే మంజూరుచేసి, 1,013 షెడ్ల పనులు మాత్రమే చేపట్టింది. ఇందులోనూ 961 మాత్రమే పూర్తయ్యాయి. మరోవైపు ఫారం పాండ్స్‌, ఇంకుడు గుంతల లక్ష్యాలు కూడా నెరవేరలేదు. వీటిలో ముఖ్యంగా రోడ్లు, కాలువలు, షెడ్ల నిర్మాణాలు లక్ష్యానికి చేరుకోకపోవడం వెనుక జిల్లాలోని పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత కీలకంగా ఉపయోగించు కోవాల్సిన ఈ నిధులు, పనులపై తొలి నుంచీ తగిన సమీక్షలు లేవు. ఎమ్మెల్యేల నుంచి, జిల్లాకు చెందిన మంత్రి వరకు దృష్టిసారించక పోవడం వల్లే రూ. కోట్లు వెనక్కిపోయాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ గ్రామాల్లో రోడ్లు మెరుగుపడతాయని, కొత్తగా రోడ్లు వస్తాయని వేయి కళ్లతో ఆశించిన ప్రజానీకానికి నిరేశే ఎదురైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనైనా పాలకులు చిత్తశుద్ధితో పనిచేయాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

➡️