వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలి

Jan 7,2025 16:09 #Chittoor

ప్రజాశక్తి – చిత్తూరు : విభజన చట్టంలో భాగంగా కడప ఉక్కు పరిశ్రమను ప్రభుత్వమే నిర్వహించి, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయాలని ప్రధాని పర్యటనను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వకుండా పది సంవత్సరాలుగా మోసం చేసిన బిజెపి ప్రధాని పర్యటనను రాష్ట్ర ప్రజలు నిరసించాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కడప ఉక్కు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేసిన నాయకులు పార్టీలు అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి ఊసే మాట్లాడడం లేదని విమర్శించారు. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు సుమారు రెండు సంవత్సరాలుగా కార్మికులు, ప్రజలు పోరాడుతున్న విశాఖపట్నం కి ప్రధాని రావడం ఆంధ్ర ప్రజలను అగౌరవంపరచడమేనని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని చెప్పి ఆంధ్రాలో ప్రధాని పర్యటించడం తెలుగువారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటమేనని విమర్శించారు. రాయలసీమకు ద్రోహం చేసిన బిజెపిని నేడు రాష్ట్రంలో ఉన్న అధికార భాగస్వామి పక్షాలు సమర్పించడం దుర్మార్గమన్నారు. బిజెపి గతంలో రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించి ఇప్పుడు మాకు సంబంధం లేదు అని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ 9 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలను నమ్మించి బిజెపి ద్రోహం చేసింది. పది సంవత్సరాలుగా రాష్ట్ర హోదాపై పూటకో మాట మార్చి ఆంధ్ర ప్రజలను నట్టేట ముంచింది. రాష్ట్రంలోని ఓడరేవులు,రోడ్లు, రైల్వే లైన్లు ఆదాని కంపెనీకి అప్పగిస్తుంది. సోలార్,గాలిమరలు, విద్యుత్ ఉత్పత్తి పేరుతో రాయలసీమలోని వేల ఎకరాల భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తుంది. ఇన్ని రకాలుగా ఆంధ్ర ప్రజలను దగాచేస్తున్న బిజెపిని నిలదీయాల్సిన టిడిపి జనసేన వారి సేవలో తరిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉండి కూడా కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఒక మాట మాట్లాడలేదని స్థితిలో వైసిపి ఉంది. అందుకే సిపిఎం రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రాన్ని నిలదీస్తున్నది. బిజెపి చేస్తున్న అన్యాయాలపై పోరాడుతుంది. ప్రజలందరూ కూడా బిజెపి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకించాలని పిలిపునిచ్చారు. కేంద్రంలోని మతోన్మాద బిజెపి పాలనకు వ్యతిరేకంగా భవిష్యత్తులో చేసే పోరాటాలకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఓబుల్ రాజు గిరిధర్ గుప్తా, భువనేశ్వరి ఓఅర్జప్, చిలకమ్మ,సంజయ్, రాజా జయంతి తదితరులు పాల్గొన్నారు.

➡️