మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్‌ నాశనం : సిఐ

Nov 28,2024 16:44 #Konaseema

ప్రజాశక్తి-రాజోలు : మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలని రాజోలు సిఐ నరేష్ కుమార్ అన్నారు. గురువారం పొన్నమండ గ్రామంలో యాంటీ డ్రగ్స్‌, యాంటీ ర్యాగింగ్‌ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ డ్రగ్స్‌ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యల గురించి వివరించారు. చాలామంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని, అప్రమత్తంగా ఉండాలని వీటికి  విద్యార్థులు దూరంగా ఉండాలని హితవు పలికారు. యువత దేశానికి పట్టుకొమ్మలని వారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలని, సమాజాభివృద్ధికి తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులకు సూచించారు. ఒక వ్యక్తి డ్రగ్స్‌ కి అలవాటు అయితే మాన్పించడం చాలా కష్టమని డ్రగ్స్‌ వినియోగం వల్ల ఆ వ్యక్తి ఏం చేస్తాడో తనకే తెలియదని, మత్తులో నిద్రిస్తాడని, క్రూరమైన ఆలోచనలు కలిగి ఉంటాడని తెలియజేశారు. విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్టు అనుమానం వచ్చినా, విక్రయిస్తున్నట్టు తెలిసిన పోలీసులకు సమాచారం అందివాలని అప్పుడు మాత్రమే డ్రగ్స్‌ రహిత సమాజం సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు, సామాన్య ప్రజలు పోలీసులకు తమ వంతు సహాయ, సహకారాలు అందించాలని సూచించారు. కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలియజేశారు. రాజొలు ఎస్ఐ రాజేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్‌ కు పాల్పడితే చట్టపరంగా ఎలాంటి శిక్షలు ఉంటాయో వివరించారు. విద్యార్థులందరూ తమ తోటి విద్యార్థులతో సోదరభావంతో మెలగాలని, సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని తెలిపారు. అదేవిధంగా లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌ చేయరాదని డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు పాటించవలసిన రహదారి నియమ నిబంధనలను విద్యార్థులకు వివరణాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో రాజోలు ఎస్ఐ బి.రాజేష్ కుమార్,సర్పంచ్ కుక్కల బేబీ కుమారి స్థానిక మహిళలు,యువత పాల్గోన్నారు.

➡️