దారి దోపిడీ దొంగల ముఠా అరెస్టు

ప్రజాశక్తి- బాపట్ల : రాత్రి సమయంలో దారి కాచి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను బాపట్ల రూరల్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు డిఎస్‌పి రామాంజనేయులు తెలిపారు. సానిక రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డిఎస్‌పి వివరాలను వెల్లడించారు. ఈనెల 6న బాపట్ల పట్టణంలోని ధనలక్ష్మి రైస్‌ మిల్లు వద్ద నుంచి ఓ లారీ వరిపొట్టు (ఊక) లోడుతో దుగ్గిరాల కాపీ ఫ్యాక్టరీ కి బయలుదేరింది. లారీ బాపట్ల మండలం కొండు బొట్ల పాలెం క్రాస్‌ రోడ్డు వద్దకు వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు ట్రాఫిక్‌ సమయంలో ఉపయోగించే బారికేడ్లను రోడ్డు అడ్డంపెట్టారు. లారీని ఆపి డ్రైవర్‌ ను గాయపరిచి అతని వద్ద నుంచి రూ.1,500 నగదు, సెల్‌ ఫోన్లు లాక్కున్నారు. బాధితుడు, ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన లారీ డ్రైవర్‌ రావూరి వాసు ఫిర్యాదు మేరకు రూరల్‌ సిఐ కె.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు బాపట్ల 4వ వార్డుకు చెందిన షేక్‌ మదార్‌, బాపట్ల అంబేద్కర్‌ నగర్‌ ఉప్పరపాలెంకు చెందిన చేగూడి ఆనందబాబు, బాపట్ల పట్టణం రైలు పేట మహాలక్ష్మి అమ్మవారి చెట్టు ఏరియాకు చెందిన మహమ్మద్‌ ఇక్బాల్‌ , బాపట్ల పట్టణం శాంతినగర్‌కు చెందిన షేక్‌ బాషిద్‌గా గుర్తించారు. ఈ క్రమంలో లారీ డ్రైవర్‌ దొంగిలించిన సెల్‌ ఫోన్‌ను అమ్మేందుకు బాపట్ల ఓ మొబైల్‌ షాప్‌ వద్ద నిందితులు వచ్చారు. బాపట్ల రూరల్‌ సీఐ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఎం. శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది నిందితులను అరెస్టు చేసినట్లు డిఎస్‌పి తెలిపారు. నిందితులపై తెనాలి జిఆర్‌పి పోలీస్‌ స్టేషన్‌, బాపట్ల, చీరాలలో అనేక కేసులు నమోదైద ఉన్నట్లు డిఎస్‌పి తెలిపారు. నిందితులను చాక చక్యంగా పట్టుకున్న రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందిని డిఎస్‌పి రామాంజనేయులు అభినందించారు. ఈ సమావేశంలో రూరల్‌ సిఐ, ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

➡️