హామీలు నెరవేర్చాలని గంగవరం నిర్వాసితుల నిరసన

Jan 12,2025 00:12 #Gangavaram Nirvasithulu
Gangavaram Nirvasithulu

ప్రజాశక్తి -గాజువాక : తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అదాని గంగవరం పోర్టు నిర్వాసితులు, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యాన శనివారం పోర్టు బ్రిడ్జి సమీపంలో నిరసన తెలిపారు. వారికి మద్దతు తెలుపుతూ సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ, అదాని గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అదాని గంగవరం పోర్టు కుట్ర పూరితంగానే కార్మికులను ప్యాకేజీ పేరుతో రోడ్డున పడేసిందన్నారు. అదాని గ్రూపు సంస్థలకు రోజుకు రూ.1600 కోట్లు వస్తుందని, అందులో కొద్ది భాగం కేటాయిస్తే గంగవరం పోర్టు నిర్వాసితులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. నిర్వాసితులకు జెట్టీ నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పి పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. నిర్వాసిత కమిటీ నాయకులు నొల్లి తాతారావు మాట్లాడుతూ, ఇప్పటికే నిర్వాసితులకు అన్ని విధాలా అన్యాయం జరిగిందన్నారు. ఉద్యోగాలు, జెట్టీ లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల దిబ్బపాలెం, గంగవరం గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే జెట్టీని నిర్మించాలని కోరారు. అదాని గంగవరం పోర్టు యాజమాన్యం, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కమిటీ సభ్యులు గంటిపిల్లి అమ్మోరు మాట్లాడుతూ, తక్షణమే సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తమతో జరిగిన ఒప్పందం ప్రకారం రూ.27 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్‌చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీ మేరకు జెట్టీ నిర్మాణం, పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని, అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాసిత ఉద్యోగుల సంఘం నాయకులు కదిరి సత్యానందం, పెదగంట్యాడ నిర్వాసిత నాయకులు గొందేశి మహేశ్వర్‌రెడ్డి, కంబాల దానయ్య, వాసుపల్లి ఎల్లయ్య, చీకటి అప్పారావు, మోటూరు రాము, కదిరి తాతారావు, కదిరి సింహాద్రి, బడిరాజు పాల్గొన్నారు.

➡️