ప్రజాశక్తి-బాపట్ల: కార్తీక మాసం సందర్భంగా సూర్యలంక బీచ్‌కు వచ్చే పర్యాటకుల సౌకర్యం కోసం ఆ మార్గంలో రహదారి వెంట చెత్తాచెదారాన్ని తొలగించే పనులు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ జి.రఘునాథ రెడ్డి తెలిపారు. మంగళవారం సూర్యలంక రోడ్డు మార్జిన్ చదును చేసే పనులను సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. కార్తీక మాసంతోపాటు ప్రత్యేక సెలవు రోజుల్లో సూర్యలంకకు విచ్చేసే పర్యాటకుల రద్దీ దష్ట్యా పట్టణంలో ప్రధాన రహదారుల మార్జిన్లను సైతం శుభ్రం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ సూచనల మేరకు పట్టణ మురుగనీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని మత్స్యపురి కాలనీ ప్రాంతంలో పరిశీలించారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్‌పై అక్కడి కాలనీవాసులతో మాట్లాడారు. జమ్ములపాలెం రోడ్డులోని మునిసిపల్ డంపింగ్ యార్డును నందనవనంగా తీర్చిదిద్దడంతోపాటు, మురుగు నీటిని శుద్ది చేసేందుకు సంబంధిత సంస్థ ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. త్వరలోనే నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. కమిషనర్ వెంట శానిటరీ ఇన్‌స్పెక్టర్లు డి.శ్రీనివాసరావు, సి.హెచ్.కరుణ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు షేక్ ఇమామ్, శివరామకష్ణ పాల్గొన్నారు.