ప్రజాశక్తి-వెలుగోడు (నంద్యాల) : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపు నుండి ఉచితంగా అందజేసిన గ్యాస్ సిలిండర్ సబ్సిడీ సొమ్ము వినియోగదారుల ఖాతాలలో జమ అవుతుందని వెలుగోడు డిప్యూటీ తహసిల్దార్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం వెలుగోడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో మధుసుధన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎంపీపీ లాలం రమేష్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసిల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్యాస్ వినియోగదారులు తమ ఖాతాలలో ప్రభుత్వ సబ్సిడీ సొమ్ము జమ కావడం లేదని తమ కార్యాలయానికి అర్జీలు అందజేస్తున్నారని అన్నారు. అటువంటి వారందరూ తప్పని సరిగా ఆధార్, ఈ కేవైసీ, బ్యాంక్ ఖాతా సరిచూసుకోవాలని అన్నారు. అదేవిధంగా గ్రామ సభలలో భూ – రీ సర్వేపై 590 అర్జీలు అందాయని అన్నారు. ఎంపీడీవో మధుసుధన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో పెన్షన్ దారులకు ప్రతి నెల అందజేసే వారిని అన్నారు. ఇకపై ఒక నెల రెండో నెల అందక పోయినా అటువంటి వారికి మూడు నెలలు కలిపి మొత్తం అందజేయ బడుతుందని అన్నారు. అదేవిధంగా పెన్షన్ తీసుకుంటున్న భార్యా భర్తలలో ఎవరో ఒకరికి మరణం సంభవించిన అటువంటి వారికి ఆలస్యం చేయకుండా వెంటనే పెన్షన్ అందజేయ బడుతుందని అన్నారు. ఈఓఆర్డి మురారి మాట్లాడుతూ వీధిలైట్లకు ఇకపై సెన్సార్ త్వరలో వస్తుందని తెలిపారు. సెన్సార్ ఆధారంగా వీధిలైట్లు పగటిపూట వెలగవని, చీకటి పడితే అవే ఆటోమేటిక్ గా వెలుగు తాయని అన్నారు. డిసెంబర్ నెలలో తొమ్మిది లక్షల చేప పిల్లలను వెలుగోడు తెలుగు గంగ జలాశయంలో విడుదల చేస్తామని మత్స్యశాఖ భరద్వాజ్ నాయక్ అన్నారు. ఆత్మకూరు నంద్యాల ప్రయాణించే ఆర్టీసీ అద్దె బస్సులు అతివేగంగా వెళుతున్నాయని వైస్ ఎంపీపీ నసీరుద్దీన్ ఆర్టీసీ వాళ్లకు సమాచారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వెలుగోడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యురాలు సులోచన, ఏఈపిఆర్ శ్రీనివాసులు, హౌసింగ్ ఏఈ శ్రీను, పశు సంవర్ధక శాఖ కిషోర్ కుమార్ రెడ్డి, ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యులు నజీర్ అహ్మద్, ఆర్ డబ్ల్యు ఎస్ జయపాల్ రెడ్డి, ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వెలుపల జయపాల్, ఎంపీటీసీ జనాభా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
