గజానికో గొయ్యి…

May 16,2024 20:38

ప్రజాశక్తి – కొమరాడ:  ప్రధాన రహదారులైన అంతర్‌రాష్ట్ర రహదారి అధ్వానంగా గోతులు ఏర్పడడంతో వాహనదారులు నిత్యం అవస్థలు పడుతూ ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పార్వతీపురం నుంచి కూనేరు అంతర్‌రాష్ట్ర రహదారి గత ఐదేళ్లుగా అధ్వానంగా మారి అనేక ప్రమాదాలకు నిలయాలుగా మారుతుంది. ఐదేళ్ల నుంచి సిపిఎం ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు, నిరసనలు చేయడంతో కొంతమేరకు అధికారులు స్పందించి అక్కడక్కడ గోతులు కప్పి మరమ్మతులు చేశారు. మరికొన్ని ప్రదేశాల్లో పూర్తిగా గోతులైనప్పటికీ పట్టించుకోకపోవడంతో అవి కాస్త ఇప్పుడు పెద్ద గోతులుగా మారి ప్రమాదాలకు పిలుపునిస్తున్నాయి. చోళపదం శివాలయం, కొమరాడ గ్రామ సమీపంలో రెండు చోట్ల అంతర్‌ రాష్ట్ర రహదారిపై భారీ గోతులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ గోతుల్లో నిత్యం లారీలతో పాటు చిన్న చిన్న వాహనాలు మరమ్మతులకు గురై గోతుల్లో నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా గోతుల వద్ద చిన్న కార్లు, గోతులు దిగిపోయి మరమ్మతులు గురవ్వడంతో లక్షల్లో మదుపులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. గత వారం రోజుల నుంచి స్వల్పంగా పడుతున్న వర్షాలకు గోతుల్లో భారీగా వాట్సాప్‌ నీరు చేరడంతో గోతులు కనిపించక కార్లు, ద్విచక్ర వాహనదారులు గోతుల్లో పడిపోయి ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో గోతుల్లో దిగిపోవడంతో వాహనాలు సైతం మరమ్మతులకు గురికాగా, ప్రజలు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలవుతున్నారు. రోడ్లన్నీ దారుణంగా తయారవ్వడంతో గర్భిణులు, వృద్ధులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు సైతం తమపంటను మిల్లులకు తరలించేందుకు అధిక కిరాయిలు చెల్లించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రోడ్లపై గోతులకు భయపడి ఆటోవాలాలైతే అసలు కిరాయికి రావడానికి సైతం భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన భారీ గోతులను కప్పి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.

➡️