బాపట్ల జిల్లా ఎడ్ల జతలకు బహుమతులు

Jan 31,2025 23:46

ప్రజాశక్తి – రెంటచింతల : కానుక మాత 175వ తిరుణాళ్ల సందర్భంగా మండల కేంద్రమైన రెంటచింతలలోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఎడ్ల పందేలు కొనసాగుతున్నాయి. శుక్రవారం న్యూ కేటగిరి బండలాగుడు ఎడ్ల పోటీల్లో బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన అత్తోట శిరీష చౌదరి, శ్రీకృష్ణ చౌదరిఎడ్ల జాతకు 3900.9 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నాయి. బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన వజ్రాల వెంకటేశ్వర్‌రెడ్డి ఎడ్ల జత 3900 అడుగులతో రెండోస్థానం, బాపట్ల జిల్లా ఉప్పుమాగులూరుకు చెందిన రవిశంకర్‌రెడ్డి ఎడ్ల జత 3300 అడుగులతో మూడోస్థానం, రెంటచింతల మండలం రెంటాలకు చెందిన డాక్టర్‌ హుస్సేన్‌ కోదాడ, పిన్నబోయిన అభిషేక్‌ యాదవ్‌ కంబైన్డ్‌ జత 3287.8 అడుగుల దూరంతో నాలుగోస్థానం, కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన కొలుసు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు ఎడ్ల జత 3135 అడుగుల దూరంతో ఐదోస్థానం, నరసరావుపేట మండలం దొండపాడుకు చెందిన ఎర్రం రాజశేఖర యశ్వంత్‌ ఎడ్లజత 2889 అడుగుల దూరంతో ఆరోస్థానం సాధించాయి. మొత్తం 10 ఎడ్ల జతలు పోటీలో పాల్గొనగా 9 జతలకు బహుమతులు ప్రదానం చేయగా, ఒక జతకు కన్సోలేషన్‌ బహుమతి అందించారు. కమిటీ సభ్యులైన వైల్‌.మర్రెడ్డి సుమంత్‌ రెడ్డి, అల్లం ప్రతాపరెడ్డి పోటీలను పర్యవేక్షిస్తున్నారు.

➡️