ప్రజాశక్తి-పామూరు: బాలింతలకు బాలికలకు పౌష్టికాహారం అందించాలని సిడిపిఓ పార్వతి తెలిపారు. శనివారం మండలంలోని వీర భద్రాపురం ప్రాథమిక పాఠశాలలో పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతి మాట్లాడుతూ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల బాలికలకు పోషకాహార ప్రాముఖ్యతను గూర్చి వివరించారు. పోషక పదార్థాలను లోగో రూపంలో ప్రదర్శించి వాటిలో ఉండే పోషకాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. బాలికలు ఎక్కువగా రక్తహీనతకు గురవుతున్నారని, రోజూ తీసుకునే ఆహారంతో పాటు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చిరు, పప్పు ధాన్యాలను తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. బాలికలకు 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేయడం నేరమన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి పెంచాలని కోరారు. తదుపరి ఆరోగ్య సిబ్బంది బాలికలకు రక్త పరీక్షలు నిర్వహించారు. రక్తహీనత కలిగిన బాలికలకు తగు సలహాలు, సూచనలు, వ్యక్తిగత పరిశుభ్రతను గూర్చి వివరించారు. తదుపరి వగ్గంపల్లి సెక్టార్ సమావేశం నిర్వహించి, రికార్డులు పరిశీలించి నివేదికలను పూర్తి చేయించి తీసుకున్నారు. అంగన్‌వాడీ పాఠశాల నిర్వహణలో తగు సూచనలను సూపర్‌వైజర్ తెలియజేశారు. బాలసంజీవిని యాప్‌లో హాజరు, అందిన ఆహార పదార్థాలను నమోదు చేయాలని, గర్భిణులు, బాలింతలకు ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా టీహెచ్‌ఆర్ ఇవ్వాలన్నారు. పాఠశాలకు సమయం ప్రకారం వెళ్లి పూర్వ ప్రాథమిక విద్యను బోధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కోటిరెడ్డి, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ప్రభాకర్, ఏఎన్‌ఎం పద్మ, ఎంఎల్‌హెచ్‌పి అనంతలక్ష్మి, ఆశ వర్కర్ ప్రభావతి, సెక్టార్ కార్యకర్తలు, పాఠశాల బాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.