గ్రామ సభలో సమస్యలను చెబుతున్న రైతులు
ప్రజాశక్తి-ఈపూరు : మండలంలోని అంగలూరు గ్రామంలో అగ్రహారం భూముల సమస్యను పరిష్కరించడంలో భాగంగా రెవెన్యూ అధికారులు మంగళవారం గ్రామసభ నిర్వహించారు. తహశీల్ధార్ ఎ.నళిని మాట్లాడుతూ గ్రామంలో అన్‌సెటిల్డ్ భూమి1264 ఎకరాలు ఉందని, ఇందులో ప్రభుత్వ భూమి 153.74 ఎకరాలు, సర్వీస్ ఈనాం భూమి 195 ఎకరాలు, ఉత్తరాది మఠమునకు చెందిన భూమి 905 ఎకరాలు ఉందని వివరించారు. భూములపై రైతుల అభిప్రాయాన్ని కోరారు. భూ రీసర్వేలో భాగంగా ఇప్పటికే గ్రామ హద్దులను గుర్తించామని, బ్లాకులుగా విభజించి సర్వే చేస్తామని, అనుభవంలో ఉన్న రైతులు వారి వద్ద ఉన్న పత్రాలను చూపి సర్వేకు సహకరించాలని కోరారు. ఉత్తరాది మఠం ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామంలోని భూములు ఇనాం భూములు కావని ఉత్తరాది మఠం అనే సంస్థకు చెందినవని, ఏళ్ల తరబడి సాగు చేసుకున్నప్పటికీ రైతులు హక్కులు పొందలేరని, చట్ట ప్రకారం ఆ భూముల పూర్తి హక్కులు ఉత్తరాది మఠంకే ఉంటాయని అన్నారు. మాజీ ఎంపీపీ, రైతు బొల్లా వెంకట కోటయ్య మాట్లాడుతూ వందేళ్లకు పైబడి గ్రామంలోని రైతులు బీడు భూములను సాగు భూములుగా మార్చారన్నారు. భూ హక్కులు లేని కారణంగా బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నారని, ప్రభుత్వ పథకాలూ అందక నష్టపోతున్నారని తెలిపారు. ఎకరాకు రూ.50 వేలు చొప్పున చెల్లిస్తామని, మానవతా దక్పథంతో సహకరించి శాశ్వత పరిష్కారం చూపాలని విన్నవించారు. ఉత్తరాది మఠం న్యాయవాది రమేష్ మాట్లాడుతూ రైతులు ఓ కమిటీగా ఏర్పడి తమ అభిప్రాయాలను తెలియజేస్తే వాటిని ఉత్తరాది మఠం కమిటీ ముందుంచి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ ఎం.పవన్, ఇన్‌ఛార్జి ఆర్‌ఐ ఒ.శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ సైదా, వీఆర్వో వెంకటేష్, న్యాయవాదులు ఎన్.రామకోటేశ్వరరావు, పి.సైదారావు పాల్గొన్నారు.
