ప్రజాశక్తి-యంత్రాంగం వేపగుంట : ముందస్తు గుర్తింపుతో గ్లకోమాను నివారించవచ్చని డాక్టర్ టి.రవీంద్ర చెప్పారు. శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యాన గ్లకోమా వారోత్సవాల్లో భాగంగా గ్లకోమా కారణాలు, నివారణ, ప్రభావంపై ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నాయుడుతోటలోని ఆసుపత్రి నుండి వేపగుంట జంక్షన్ వరకు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిజిఎం కె.బంగారురాజు పాల్గొన్నారు. తగరపువలస : స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్రంలో గ్లకోమా వారోత్సవాలను బుధవారం నిర్వహించారు. వారోత్సవాల ప్రాధాన్యతను ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కె.సుష్మిత వివరించారు. గ్లకోమా కంటి లోపల పీడనం పెరిగి కంటి నరాన్ని చచ్చుబడేటట్లు చేస్తుందన్నారు. తద్వారా క్రమంగా కను చూపు తగ్గిపోతుందన్నారు. 40 ఏళ్లకు పైబడిన వ్యక్తులు తరచుగా కంటి అద్దాలు మార్పించుకోవాల్సి రావడం, వెలుతురు చుట్టూ రంగుల వలయం లా కనబడటం ప్రాథమిక లక్షణాలు అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
