విక్రేతలతో మాట్లాడుతున్న అధికారులు
ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు నగరంలో రోడ్లపై అనధికారికంగా నాటుకోళ్ళు, చేపల విక్రయాలపై ప్రజారోగ్యం దృష్ట్యా కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పేర్కొన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు జిఎంసి ప్రజారోగ్య అధికారులు బృందాలుగా ఏర్పడి నగరంలోని చుట్టుగుంట, నల్లపాడు రోడ్డు, మిర్చియార్డ్, ఆర్.టి.ఒ ఆఫీసు, గుజ్జనగుండ్ల, అమరావతి రోడ్డు, పట్టాభిపురం ప్రాంతాలలో రోడ్లపై అనధికారికంగా చేపలు, నాటుకోళ్ళు, మేకలను వధించి విక్రయిస్తున్న వారిని గుర్తించి వారిపై దాడులు నిర్వహించి వాటిని తొలగించి, అపరాధరుసుము కింద రూ.12,500 విధించామని తెలిపారు. నగర పరిధిలో ఎక్కడైనా అనధికారికంగా నాటుకోళ్ళు, చేపలు, మాంసం విక్రయాలు జరిపే వారిపై కఠిన చర్యలు, భారీమొత్తంలో అపరాధ రుసుం, విధించ టమే కాకుండా, వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. నగరంలో మాంసం విక్రయాలు జరిపే యజమానులు సంబంధిత డాకుమెంట్స్ అందజేసి డిఅండ్‌ఓ ట్రేడ్ లైసెన్స్ పొంది వ్యాపారం నిర్వహించుకోవాలన్నారు. లైసెన్స్ లేని వారి షాపులను సీజ్ చేయటం జరుగుతుందన్నారు. మాంసం విక్రయించే షాపుల యజమానులు షాపు చుట్టు ప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మాంసంపై దుమ్ము, ధూళి పడకుండా మెష్‌లు కట్టి ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంహెచ్‌ఒ డాక్టర్ రవిబాబు, వెటర్నరి డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్.ఎస్. ఆనందకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్లు సి.హెచ్.శ్రీనివాస్, నాగేశ్వరరావు, రాము, దాస్ పాల్గొన్నారు.
