ఏర్పాట్లు పరిశీలిస్తున్న కమిషనర్ పి.శ్రీనివాసులు
ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీకి సోమవారం జరిగే ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం కమిషనర్ ఎన్నికల అధికారి, జిఎంసి అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, ఇతర అధికారులతో కలిసి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. సూచిక బోర్డులు, పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కంపార్ట్‌మెంట్ బ్యాలెట్ బాక్స్, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామగ్రిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశ ద్వారానికి, బయటకు వెళ్లు ద్వారాలకు ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, సోమవారం ఉదయం 10.30 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందని చెప్పారు. ఓటు వేయటానికి వచ్చే కార్పొరేటర్లుకు మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని, లోపలకు వచ్చే సమయంలో జిఎంసి జారీ చేసిన గుర్తింపు కార్డు విధిగా కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఫోన్లు, ఎలక్ట్రికల్ సంబంధిత వస్తువులు, ఏ ఇతర సామగ్రిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబోమన్నారు. కార్పొరేటర్ల ఇతర వస్తువులు భద్రపరచుకోవటానికి జిఎసంసి పార్కింగ్‌లో పౌరసేవా కేంద్రం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్లోక్ రూమ్‌లో బద్రపరచుకోవాలని కోరారు. పోలింగ్ సందర్భంగా నగర పాలక సంస్థ కార్యాలయంలోకి ఇతర వాహనాలు పార్కింగ్ నిషేధించామని, ఓటింగ్ కోసం కార్యాలయానికి వచ్చే కార్పొరేటర్ల వాహనాలను గాంధీపార్క్ పార్కింగ్‌లో వాహనాలు నిలుపుకోవాలని తెలిపారు. జిఎంసి ఉద్యోగులు విధిగా గుర్తింపు కార్డుతో, వారికి కేటాయించిన విభాగాల్లోనే విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల అధికారి మినహా ఇతర ఎన్నికల సిబ్బంది ఫోన్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబోమన్నారు. ఎన్నికల నిర్వహణలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రతతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ప్రిసైడింగ్ అధికారి, డిప్యూటీ కమిషనర్-1 డి.శ్రీనివాసరావు, కౌన్సిల్ సెక్రెటరీ పి.శ్రీనివాసరావు, ఓటర్ల గుర్తింపు అధికారి, జిఎంసి మేనేజర్ షేక్ బాలాజీ బాషా, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ పద్మనాభరావు, సిబ్బంది పాల్గొన్నారు.
