‘గో బ్యాక్‌ మోడీ’ : సిపిఎం ధర్నా

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ (అన్నమయ్య) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నిట్ట నిలువునా ముంచిన ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె అర్బన్‌లోని స్థానిక మార్కెట్‌ యార్డు వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ‘8వ తేదీ మోడీ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ గో బ్యాక్‌ మోడీ’ అంటూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ … రాష్ట్ర విభజన హామీలను తుంగలో తొక్కి, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు పన్నాగాలు పన్నుతున్న నరేంద్ర మోడీ ఏ మొహం పెట్టుకొని రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని చూడడం, కడప ఉక్కును ప్రారంభించకపోవడం, తాగునీటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వంటి ఎలాంటి అభివృద్ధి పనులు చేయని నరేంద్ర మోడీ ఇంకా ఎవరిని మోసం చేయాలని వస్తున్నారని ప్రశ్నించారు. నరేంద్ర మోడీతో అంటకాగుతున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై మాట్లాడాలని కోరారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించబోమని, కడప ఉక్కును ప్రారంభిస్తామని ప్రధాని మోడీతో ప్రకటన చేయించాలని డిమాండ్‌ చేశారు. ఇన్నేళ్లు బిజెపితో అంటకాగిన వైసీపీ సైతం ప్రజల్లోకి వచ్చి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని, రాష్ట్ర విభజన హామీలపై బీజేపీని ప్రశ్నించాలని కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కోసం విట్టల్‌ స్టీల్‌ ను అనకాపల్లిలో ప్రారంభిస్తున్నారని దీన్ని సిపిఎం ఆధ్వర్యంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రానికి చెంబుడు నీళ్లు, మట్టి ఇచ్చిన నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని మట్టుపెట్టారని, దీన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ రాష్ట్రాభివృద్ధికి ప్రకటనలు చేసిన తర్వాతే రాష్ట్ర పర్యటనకు రావాలన్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఆంధ్రరాష్ట్ర విభజన హామీలను నెరవేర్చి, ప్రత్యేక హోదా ఇచ్చి, తాగు, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో విశాఖ ఉక్కును ప్రభుత్వమే నిర్వహించాలని, కడప ఉక్కును ప్రారంభించి అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు హరినాథ్‌ శర్మ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నరసింహ, సిపిఎం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

➡️